చదువుకుందాం రండి
జిల్లాలో 42 రోజుల పాటు నిర్వహించనున్న బడి బయటి పిల్లల సర్వే
సర్వే ప్రారంభం
జిల్లాలో నవంబర్ 20 నుంచి డిసెంబర్ 31 వరకు వరకు చేపట్టే బడి బయటి పిల్లల సర్వే ఇప్పటికే ప్రారంభించాం. గత సర్వేలో 333 మంది విద్యార్థులను గుర్తించాం. ఈ వివరాలను ప్రబంద్ యాప్ పోర్టల్‌లో సర్వే వివరాలు నమోదు చేయాలని సిబ్బందికి ఆదేశించాం. సీఆర్పీలు దగ్గరుండి బడిఈడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించనున్నారు. నాలుగు పద్ధతుల ద్వారా బడీడు పిల్లలకు విద్య అందే విధంగా చర్యలు తీసుకుంటాం.
– విద్యాసాగర్, ఏఎంఓ నారాయణపేట
నర్వ: బడికి రాని పిల్లలు ఎంతమంది ఉన్నారు? పాఠశాలకు రాకపోవడానికి కారణం ఏమిటి అని లెక్క తేల్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి బడి బయటి పిల్లల గుర్తించేందుకు సర్వే నిర్వహించాలని తెలంగాణ సమగ్రశిక్ష సంచాలకులు ఉత్తర్వులు జారీ చేశారు. సీఆర్పీలు తమ పరిధిలోని పాఠశాలలకు వెళ్లి మధ్యలో బడి మానేసిన పిల్లల వివరాలు సేకరిస్తారు. 30 రోజుల పాటు నిరంతరంగా గైర్హాజరైన పిల్లవాడిని డ్రాపౌట్‌గా పరిగణిస్తారు. విద్యార్థుల వివరాల సేకరణ సర్వే ఈ నెల 20 నుంచి ప్రారంభమై డిసెంబర్ 31న పూర్తవుతుంది. సర్వేపై ఎంఈఓ, స్కూల్‌కాంప్లెక్స్ హెచ్‌ఎంలు, పాఠశాల హెచ్‌ఎంలు, సీఆర్పీలు, ఎంఐసీసీఓలతో సమావేశం నిర్వహిచారు. షెడ్యూల్ ప్రకారం సేకరించిన పిల్లల వివరాలను ఎంఐసీసీఓలు మండలాల వారీగా ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలి. సర్వే పూర్తి చేసిన తర్వాత వివరాలను జనవరి 2 లోపు ప్రబంద్‌పోర్టల్‌లో నమోదు చేయాలి. డిసెంబర్ 12 వరకు డీఈఓలు రాష్ట్రస్థాయి అధికారులకు నివేదిక అందజేయనున్నారు.
2024–25 కు సంబంధించి..
గతేడాది బడి బయటి పిల్లల వివరాలను జనవరిలో సేకరించారు. పలు కారణాలతో విద్యాసంస్థల్లో చేరని బడిఈడు పిల్లల వివరాలను ప్రభంద్ పోర్టల్ యాప్‌లో నమోదు చేశారు. విద్యాశాఖ 2024–25 ఏడాదికి సంబంధించి జనవరి 4 నుంచి 25 వరకు మరోసారి సర్వే నిర్వహించింది. ఈ క్రమంలో గతేడాది జనవరిలో గుర్తించిన బాలబాలికల్లో ఎంతమంది విద్యా సంస్థల్లో చేరారు.. మిగితా వారు ఎందుకు చేరలేదు అనే వివరాలను ఈ సర్వేలో నమోదు చేశారు. గత సర్వేలో జిల్లా వ్యాప్తంగా 333 మంది విద్యార్థులను గుర్తించినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.
వయస్సు బాలురు బాలికలు మొత్తం
6–14 67 84 151
15–19 40 90 130
26 26 52
మొత్తం 133 200 333
నవంబర్ 20 నుంచి డిసెంబర్ 31 వరకు..
సీఆర్పీలకు బాధ్యతలు
గత సర్వేలో 333 మంది బడిబయటి పిల్లల గుర్తింపు
అందుబాటులో లేని యూఆర్‌ఎస్..
రాష్ట్ర వ్యాప్తంగా నారాయణపేట, ములుగు జిల్లాల్లో తప్ప అన్ని జిల్లా కేంద్రాల్లో అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్ (యూఆర్‌ఎస్) అందుబాటులో ఉన్నాయి. కొత్తగా ఏర్పడ్డ ఈ జిల్లాల్లో యూఆర్‌ఎస్ ఏర్పాటు చేయకపోవడంతో ఉమ్మడి జిల్లాలోని మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్ పాఠశాలలకు బడిబయటి పిల్లలను పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో నారాయణపేట జిల్లా కేంద్రంలో కూడా యూఆర్‌ఎస్ పాఠశాలను ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
చదువుకుందాం రండి
చదువుకుందాం రండి


