బాల్య వివాహాల నిర్మూలన సమష్టి బాధ్యత
నారాయణపేట: సమష్టి కృషితోనే బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దడం సాధ్యమవుతుందని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో మహిళ, శిశు సంక్షేమ, బాలల సంరక్షణ విభాగం రూపొందించిన లోగోను ఆమె ఆవిష్కరించి మాట్లాడారు. బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, బాల్య వివాహాలతో కలిగే అనర్థాలను క్షేత్రస్థాయిలో వివరించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, శ్రీను, ఆర్డీఓ రాంచందర్, డిప్యూటీ కలెక్టర్లు శ్రీరామ్ ప్రణీత్, ఫణికుమార్, డీపీఆర్వో రషీద్, మిషన్ భగీరథ ఈఈ రంగారావు, కలెక్టరేట్ సూపరింటెండెంట్ శ్రీధర్, కోస్గి తహసీల్దార్ బక్క శ్రీనివాస్, జిల్లా బాలల సంరక్షణ అధికారి కరిష్మా తదితరులు పాల్గొన్నారు.
బాలల బంగారు భవిష్యత్తుకు బాటలు..
జిల్లాలోని బాలల బంగారు భవిష్యత్‌కు బాటలు వేసేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సంతకాల సేకరణ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై స్ఫూర్తిదాయక అభిప్రాయంతో సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నేటి బాలలే భావిభారత పౌరులని.. బాలల హక్కుల సంరక్షణలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పలువురు జిల్లా అధికారులు, చైల్డ్ హెల్ప్‌లైన్ సమన్వయకర్త నర్సింహులు, జిల్లా బాలల సంరక్షణ సిబ్బంది, చైల్డ్ హెల్ప్‌లైన్ సిబ్బంది, సఖి సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.
పకడ్బందీగా చీరల పంపిణీ..
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇందిరా మహిళశక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తామని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. బుధవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, సహచర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రామకృష్ణ రావు హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెనన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం సంబంధిత అధికారులో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ప్రతి గ్రామంలో జరిగే కార్యక్రమంలో ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు ఐక్యతతో ఉండి వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వీసీలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, శ్రీను, డీఆర్డీఓ మొగులప్ప, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు అరుందతి, అన్ని మండల సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.


