మాదకద్రవ్యాల నిర్మూలనకు పాటుపడాలి
నారాయణపేట: ప్రతి పౌరుడు యాంటీ నార్కోటిక్ డ్రగ్ వారియర్‌గా పనిచేయాలని ఎస్పీ డా.వినీత్ పిలుపునిచ్చారు. నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం ప్రారంభమై ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా పోలీసు అధికారులు, సిబ్బందితో సామూహిక ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు బానిసగా మారితే భవిష్యత్ అంధకారం అవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. మాదకద్రవ్యాల వ్యాప్తిని అరికట్టేందుకు జిల్లా పోలీసుశాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని.. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని సూచించారు. డ్రగ్స్ వినియోగించినా, రవాణా చేసినా డయల్ 100 లేదా టోల్‌ఫ్రీ నంబర్ 1908కు సమాచారం అందించాలని.. సదరు వ్యక్తి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ప్రస్తుతం ప్రతి పోలీసు, యువత సైబర్ వారియర్‌గా పనిచేస్తున్నారని, ఇక నుంచి యాంటీ నార్కోటిక్ డ్రగ్ వారియర్‌గా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఎండీ రియాజ్ హుల్ హాక్, డీఎస్పీలు నల్లపు లింగయ్య, మహేశ్, సీఐ శివశంకర్, ఎస్‌ఐలు వెంకటేశ్వర్లు, నరేశ్, సురేశ్, పురుషోత్తం, సునీత తదితరులు పాల్గొన్నారు.
పొగమంచుతో జాగ్రత్త..
వాతావరణంలో పొగమంచు తీవ్రత పెరిగినందున వాహనదారులు వీలైనంత వరకు రాత్రి, తెల్లవారు జామున ప్రయాణాలు చేయొద్దని.. అత్యవసరమై తే నెమ్మదిగా, సురక్షితంగా వాహనాలను నడిపి గమ్యస్థానాలకు చేరుకోవాలని ఎస్పీ ఒక ప్రకటన లో తెలిపారు. పొగమంచు కారణంగా రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు, పాదచారులను గుర్తించే సామర్ధ్యం తక్కువుగా ఉంటుందన్నారు. చిన్నపాటి నిర్లక్ష్యంతో పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశాలు ఉంటాయని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలను వేగంగా నడపొద్దని, వాహనా ల స్థితిని ముందుగానే తనిఖీ చేసుకోవడంతో పా టు ముఖ్యంగా బ్రేకులు, లైట్లు, టైర్లు సరిగా ఉన్నా యో లేదో సరిచూసుకోవాలని సూచించారు.


