నేడు సమాచారకమిషనర్ల రాక
నారాయణపేట: రాష్ట్ర సమాచార కమిషనర్లు శుక్రవారం జిల్లాకు రానున్నారని కలెక్టర్ సిక్తా పట్నాయక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఉదయం 10 గంటలకు సమాచార హక్కు చట్టం–2005 పెండింగ్ అప్పీళ్లను స్టేట్ చీఫ్ సమాచార కమిషనర్ డాక్టర్ జి.చంద్రశేఖర్ రెడ్డి, సమాచార కమిషనర్లు పీవీ శ్రీనివాసరావు, మౌసినా పర్వీన్ పరిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా జిల్లాలోని పౌర సమాచార అధికారులు, అప్పీలేట్ అధికారులకు సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పిస్తారన్నారు. జిల్లాలో సమాచార హక్కు చట్టానికి సంబంధించిన ఫిర్యాదులు ఉంటే కమిషనర్ల ఎదుట హాజరై పరిష్కరించుకోవచ్చని కలెక్టర్ తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్లు
త్వరగా నిర్మించుకోవాలి
మద్దూరు: మున్సిపాలిటీలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తిచేసుకోవాలని పుర కమిషనర్ శ్రీకాంత్ లబ్ధిదారులకు సూచించారు. గురువారం ము న్సిపాలిటీ పరిధిలోని రెనివట్ల, రాళ్లబాయి గ్రా మాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా దశల వారీగా బిల్లుల చెల్లింపు తదితర వివరాలను తెలుసుకున్నారు. అనంతరం స్థానిక పోలీస్‌స్టేషన్ వద్ద గేటువాల్వు మరమ్మతు పనులను పర్యవేక్షించారు. ప్రజలకు అంతరాయం లేకుండా తాగునీరు సరఫరా చేయాలని సిబ్బందికి సూచించారు.
వివరాల నమోదులో నిర్లక్ష్యం చేయొద్దు
ధన్వాడ: కొనుగోలు కేంద్రాల్లో వరిధాన్యం విక్రయించిన రైతుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడంలో నిర్లక్ష్యం చేయొద్దని అదనపు కలెక్టర్ శ్రీను అన్నారు. గురువారం ధన్వాడ మండలం కిష్టాపూర్, మందిపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల నుంచి ధాన్యం సేకరించిన వెంటనే ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయడం వల్ల 24 గంటల్లో డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంటుందన్నారు. వివరాల నమోదులో ఆలస్యం చేస్తే రైతులకు ఇబ్బంది కలుగుతుందన్నారు. కాగా, ఆరబెట్టిన వరికుప్పల వద్దే తూకం వేసి లారీల్లో మిల్లులకు తరలించాలని పలువురు రైతులు అదనపు కలెక్టర్‌ను కోరగా.. రైతులు కేంద్రానికి ధాన్యం తీసుకురావాల్సిందేనని స్పష్టంచేశారు. అవసరమైతే రైతులకు అందుబాటులో మరో కేంద్రం ఏర్పాటు చేస్తామని.. వరికుప్పల వద్దకు లారీలను పంపించేందుకు వీలుపడదని తెలిపారు. ఆయన వెంట తహసీల్దార్ సిందూజ తదితరులు ఉన్నారు.
నేడు సమాచారకమిషనర్ల రాక


