ప్రభుత్వ ఆస్పత్రి కోసం పోరాటం
నారాయణపేట రూరల్: పేదలకు వైద్యం అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్యవైఖరికి వ్యతిరేకంగా బీజేపీ పోరాటానికి సిద్ధమైన ట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొండ సత్యయాదవ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆస్పత్రి లేకపోవడం సిగ్గుచేటని అన్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న ఆస్పత్రిని 8 కి.మీ. దూరానికి తరలించి ఆరు నెలలు గడుస్తున్నా ప్రథమ చికిత్స కేంద్రాలను కూడా ఏర్పాటు చేయకపోవడం బాధాకరమన్నా రు. 65వేల జనాభా ఉన్న జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆస్పత్రి లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. గతంలో బీజేపీ నిరాహార దీక్ష, పట్టణ బంద్‌కు పిలుపునిచ్చిన సందర్భంగా తాత్కాలిక ఆస్పత్రి ఏర్పాటుకు రూ. 8కోట్లు విడుదలయ్యాయని, స్థానిక ఎమ్మెల్యే మరో రూ. కోటి అదనంగా కేటాయించారని, స్థానిక ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌లో ఆస్పత్రిని ఏర్పాటు చేస్తామని డీసీసీ మాజీ అధ్యక్షుడు శివకుమార్‌రెడ్డి చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ఇచ్చిన హామీ మేరకు ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌లో తాత్కాలిక ఆస్పత్రిని ఏర్పాటు చేయడంతో పాటు పాత బస్టాండ్ వద్దనున్న చిన్నపిల్లల ఆస్పత్రిని వెంటనే పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. సమావేశంలో బీజేపీ నాయకులు నందు నామాజీ, సాయిబన్న, వెంకటయ్య ఉన్నారు.


