
ఓటు చోరీతో ప్రజాస్వామ్యం ఖూనీ
నారాయణపేట: ఒకే ఇంటి నంబర్‌పై పదుల సంఖ్యలో ఓటర్లుగా నమోదు చేసుకుంటూ కొందరు ఓటు చోరీకి పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి ఆరోపించారు. ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలోని సీవీఆర్ భవన్‌లో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎండీ సలీం ఆధ్వర్యంలో ఓటు చోరీపై సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఓటు చోరీకి వ్యతిరేకంగా సంతకం చేసి, సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఓటు చోరీ చేయడమంటే దేశ పౌరుల హక్కులను దొంగలిస్తూ ప్రజాస్వామ్యం దగా చేయడమే అన్నారు. రాజ్యాంగాన్ని దెబ్బతీసేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తుందని, మహారాష్ట్ర, కర్ణాటకలో ఓటు చోరీ జరిగిందని కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ ఆధారాలతో సహా నిరూపించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకొని కొన్ని రాష్ట్రాల్లో ఓట్లును అక్రమంగా తొలగిస్తున్నారని ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగా ఓట్ల తొలగింపును కొందరు ప్రైవేట్ వ్యక్తులు చేస్తున్నట్లు బహిర్గతం కావడం ఆందోళన కలిగిస్తుందని తెలిపారు. ప్రతి గ్రామం, వార్డుల్లో ప్రజలు సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యేలా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్లు బండి వేణుగోపాల్, సుధాకర్, సరాఫ్ నాగరాజు, మార్కెట్ వైస్ చైర్మన్ కోణంగేరి హన్మంతు, ఆర్టీఓ బోర్డు సభ్యుడు పోషల్ రాజేష్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు ప్రసన్నరెడ్డి, జిల్లా యూత్ అధ్యక్షుడు కోట్ల మధుసూదన్‌రెడ్డి, సీనియర్ నాయకులు గందె చంద్రకాంత్, మనోహర్‌గౌడ్, హరినారాయణ భట్టడ్, కోట్ల రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.