
రక్తదానంతో ప్రాణదాతలుగా నిలవాలి
నారాయణపేట: అర్హులైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యే డా.చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. గురుపౌర్ణమిని పురస్కరించుకొని స్నేహ మిత్ర మండలి ఆధ్వర్యంలో స్థానిక షిర్డీ సాయి మందిరంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. తొమ్మిదేళ్లుగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్న 1985–87 ఇంటర్మీడియట్ బ్యాచ్‌కు చెందిన స్నేహ మిత్ర మండలి సభ్యులను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ సందర్శించి.. రక్తదాతలకు అభినందనలు తెలిపారు. శిబిరంలో 74 యూనిట్ల రక్తం సేకరించినట్లు స్నేహ మిత్ర మండలి సభ్యులు డి.మదన్మోహన్‌రెడ్డి, డా.బాలాజీ సింగాడే తెలిపారు. కార్యక్రమంలో మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, రెడ్‌క్రాస్ సొసైటీ అధ్యక్షుడు సుదర్శన్‌రెడ్డి, డి.మల్లేష్, బిల్డర్ వెంకట్రాములు, గుత్తి రమేశ్, సైదప్ప, గోపాలకృష్ణ, జగన్నాథ్, విజయ్‌కుమార్, చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
నవంబర్‌లోగా పనులు పూర్తిచేయాలి..
జిల్లా మహిళా సమాఖ్య భవన నిర్మాణ పనులను నవంబర్‌లోగా పూర్తిచేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. జిల్లా కేంద్రం సమీపంలో రూ. 5కోట్లతో చేపట్టిన జెడ్‌ఎంఎస్ భవన నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. భవన నిర్మాణం ఇంకా పిల్లర్ల దశలోనే ఉండటంతో అసహనం వ్యక్తంచేశారు. భవన నిర్మాణంపై పర్యవేక్షణ పెంచాలని డీఆర్డీఓ మొగులప్ప, పంచాయతీరాజ్ ఈఈ హీర్యానాయక్‌కు సూచించారు. అదే విధంగా హ్యాండ్లూమ్ భవన నిర్మాణ పనులను నెల రోజుల్లోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట పీఆర్ డీఈ విలోక్ ఉన్నారు.