
వడివడిగా ‘భూ భారతి’
మద్దూరు: భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని ప్రభుత్వం పేర్కొన్న నేపథ్యంలో రైతుల్లో ఆశలు చిగురించాయి. ఫైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన మద్దూరు మండలంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులలో రైతులు భారీ సంఖ్యలో పాల్గొని తమ సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తు చేసుకున్నారు. 19 రెవెన్యూ గ్రామాలలో కలిపి 1341 దరకాస్తులు వచ్చాయి. వాటి పరిష్కారం కోసం అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే తహసీల్దార్ స్థాయిలో ఉన్న సమస్యలను పరిష్కారం చూపి ప్రొసీడింగ్ తయారు చేసినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో భూ భారతి చట్టం అమలు కోసం ఫైలెట్ ప్రాజెక్టుగా ఎంపికై న మద్దూరు మండలంలో ఏప్రిల్ 17 నుంచి 28 వరకు 19 రెవెన్యూ గ్రామాల్లో భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. అక్కడి నుంచి వచ్చిన ఽమద్దూరు తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తుల పరీశీలన కార్యక్రమం, సమస్యకు సంబంధించిన పాత రికార్డుల పరిశీలన, అనంతరం రైతులకు నోటీసులు అందజేయడం, సమస్య పరిష్కారానికి కలెక్టర్ సిక్తా పట్నాయక్, అడిషన్ కలెక్టర్లు బెన్ షాలాం, సంచిత్ గంగ్వార్, ఆర్‌డీఓ రాంచందర్‌నాయక్ ఆధ్వర్యంలో సమీక్షలు నిర్వహించారు. ఇందుకోసం 4 టీంలు పనిచేస్తున్నాయి.
722 దరఖాస్తుల పరిశీలన.. 436 పరిష్కారం
రెవెన్యూ సదస్సులు ద్వార వచ్చిన దరఖాస్తులో ఇప్పటి వరకు 722 దరఖాస్తులను క్షుణంగా పరిశీలించి వాటిలో 436 సమస్యలను పరిష్కారం కనుగొన్నట్లు అధికారులు తెలిపారు. 201 దరఖాస్తులు తిరస్కరణకు గురైనట్లు పేర్కొన్నారు. ఇందులో ప్రధానంగా ఎస్‌టెన్స్ కరెక్షన్, విరాసత్ తదితరాలు ఉన్నట్లు తెలిపారు. సర్వే కరెక్షన్ వచ్చిన 51 దరఖాస్తులో తహసీల్దార్ స్థాయి అధికారి, సర్వేయర్ క్షేత్రస్థాయిలో వెళ్లి 39 సమస్యలను పరిష్కరించారు. 151 పీఓబీ, అసైన్డ్ ల్యాండ్ సమస్యలపై 151 దరఖాస్తులు రాగా వాటిలో 143 సమస్యలను పరిష్కరించారు. అలాగే ఇప్పటి వరకు 1862 మందికి వచ్చిన దరఖాస్తులపై నోటీసులు అందజేసి, అభ్యంతరాలను స్వీకరించినట్లు తెలిపారు.
నెలాఖరు నాటికి పరిష్కరిస్తాం
భూ భారతి చట్టం ద్వారా వచ్చిన దరఖాస్తులన్నింటించి రికార్డుల పరంగా క్షుణ్ణంగా పరిశీలన పూర్తయింది. రైతులకు నోటీసులు జారీ చేయడంతో పాటు, కొన్ని సమస్యలను పరిష్కరించాం. ప్రస్తుతం క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టడానికి 7 బృందాలను అడిషనల్ కలెక్టర్ ఏర్పాటు చేశారు. ఆయా బృందాలు గ్రామాలకు వెళ్లాయి. ఈ నెల చివరి వరకు భూ భారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులంటిని పరిష్కరిస్తాం.
– జయరాములు, ఇన్‌చార్జ్ తహసీల్దార్, మద్దూరు
భూ సమస్యల పరిష్కారంపై అధికారుల ప్రత్యేక దృష్టి
పైలెట్ మండలం ‘మద్దూరు’లో 19 రెవెన్యూ సదస్సులు
రైతుల నుంచి 1,341 దరఖాస్తులు
క్షేత్ర స్థాయిలో మొదలైన విచారణ
ఇప్పటికీ 493 సమస్యల పరిష్కారం