
అకాల వర్షం.. అస్తవ్యస్తం
నారాయణపేట టౌన్: జిల్లాకేంద్రంలో సోమవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన అకాల వర్షానికి జన జీవనం అస్తవ్యస్తమైంది. చెట్లు ఎక్కడికక్కడ విరిగిపడగా.. విద్యుత్ తీగలు తెగి సరఫరా నిలిచిపోయింది. జిల్లా పోలీసు కార్యాలయం సమీపంలో భారీ చెట్టు విరిగి విద్యుత్ తీగలపై పడటంతో 3 స్తంభాలు విరిగిపడ్డాయి. అంజనా గార్డెన్స్, నాగులకట్ట, ఆర్డీఓ కార్యాలయం, శాతవాహనకాలని, నక్కరామయ్య కాలని తదితర ప్రాంతాల్లో చెట్లు విరిగి విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. రోడ్లపై వర్షపు నీరు పారడంతో బస్టాండ్ సమీపంలోని పెట్రోల్‌బంక్ వద్ద కాసేపు వాహనాల రాకపోకలు నిలిచిపోగా.. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చిరు వ్యాపారులు ఏర్పాటు చేసుకున్న గుడారాలు గాలికి ఎగిరిపోయాయి. పలు దుకాణాల ఎదుట ఉన్న ప్లెక్సీలు, బోర్డులు, ఇనుప రేకులు కొట్టుకుపోయి వ్యాపారులకు నష్టం వాటిల్లింది.
తడిసిన ధాన్యం..
స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డుకు అమ్మకానికి వచ్చిన ధాన్యం వర్షానికి తడిసిపోయింది. మధ్యాహ్నం వరకు టెండర్ ప్రక్రియ పూర్తికాగా.. తూకాలు వేసిన ధాన్యం బస్తాలు, ఆలస్యంగా అమ్మకానికి వచ్చిన ధాన్యం బస్తాలపై టార్పాలిన్లు కప్పినప్పటికీ ధాన్యం తడిసిపోయింది. నీటిలో కొట్టుకుపోయిన ధాన్యం తిరిగి కుప్ప వేసేందుకు రైతులు నానా అవస్థలు పడ్డారు. యార్డులోని షెడ్డు పైకప్పు ఇనుప రేకులు గాలివానకు ఎగిరిపోగా.. పలు వేపచెట్లు నేలకొరిగాయి.

అకాల వర్షం.. అస్తవ్యస్తం