
నారాయణపేట రూరల్: పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో శ్రీసత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో గురువారం చలివేంద్రం ఏర్పాటు చేశా రు. మున్సిపల్ చైర్‌పర్సన్ గందె అనసూయ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. విపరీతమైన ఎండలు ఉండటంతో ప్రజలు దాహంతో అలమటిస్తున్నారని, కొనలేని వారికి ఈ చలివేంద్రం ఎంతో ఉపకరిస్తుందన్నారు. వేసవికాలం పూర్తిగా ఉచితంగా చల్లని నీళ్లు అందించడం ఎంతో అభినందనీయమన్నారు. జిల్లాలోని ప్రధాన బస్టాండ్లు మద్దూర్, మరికల్, మక్తల్, కోస్గిలో సైతం సాయి భక్తులు సహకరించి, సేవా దృక్పథాన్ని చాటుకోవాలని డిపో మేనేజర్ ఆంజనేయులు విజ్ఞప్తి చేశారు. సేవా సమితి కన్వీనర్ మాధవరెడ్డి, మల్లికార్జున్, డి.శివరాజ్, సచిన్‌మంగల్గి, కనిగిరి విజయ్‌కుమార్, శంకర్‌బాబు, గోపీనాథ్‌రావు, ఆనంద్‌చారి, బీవీఎన్ రెడ్డి, మోహన్, చెన్నారెడ్డి పాల్గొన్నారు.
కందూరులో
ఆభరణాల ఊరేగింపు
అడ్డాకుల: మండలంలోని కందూరులో గురువారం రాత్రి స్వామివారి ఆభరణాలను ఊరేగించారు. గ్రామానికి సమీపంలో వెలసిన శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయం బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని గ్రామంలోని తంబళి వంశీయుల ఇంట్లో ఉన్న స్వామివారి వెండి ముఖం, నాగపడగలను ఈ నెల 7న రాత్రి ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకెళ్లారు. స్వామివారి బ్రహ్మోత్సవాలు, జాతర ముగి యడం, శ్రీరామ నవమి సైతం పూర్తి కావడంతో రాత్రి వాటిని రామలింగేశ్వరాలయం నుంచి ఊరేగింపుగా గ్రామంలోకి తెచ్చి తంబళి వంశీయుల ఇంట్లో భద్రపర్చిచారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీకాంత్, ఆలయ చైర్మన్ రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
మూల్యాంకనానికి
సిబ్బంది హాజరుకావాలి
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ జవాబు పత్రాల మూల్యాంకనం శుక్రవారం నుంచి పూర్తిస్థాయిలో ప్రారంభం కానుంది. ఇందులో దాదాపు 500 మందికిపైగా సిబ్బందికి విధులు నిర్వహించేందుకు బోర్డు నుంచి ఆర్డర్లు వచ్చాయని, వారందరూ విధులకు హాజరుకావాలని డీఐఈఓ వెంకటేశ్వర్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం అందరూ జిల్లా కేంద్రంలోని బాలుర కళాశాల క్యాంపులో రిపోర్టు చేయాలన్నారు. ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే ఇంటర్ బోర్డు కమిషనర్ చర్య లు తీసుకునే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే సంస్కృతం సబ్జెక్టు పేపర్ మూల్యాంకనం కొనసాగుతుండగా శుక్రవారం నుంచి ఇంగ్లిష్, తెలుగు, మ్యాథ్స్, సివిక్స్ పేపర్ల మూల్యాంకనం ప్రారంభం కానుంది. ఇందుకోసం 1.6 లక్షల జవాబుపత్రాలు వచ్చాయని, కోడింగ్ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు.
రెండు గిరకల పోటీలు
అమరచింత: శ్రీరామ నవమిని పురస్కరించుకొని ఆత్మకూర్ మండలం మూలమళ్లలో గురువారం సాయంత్రం రెండు గిరకల ఎద్దులబండ్ల పోటీలు నిర్వహించారు. మొత్తం 32 ఎద్దులబండ్లు పాల్గొనగా.. పోటీలను ఆత్మకూర్ సీఐ రత్నం ప్రారంభించారు. రాత్రి వరకు కొనసాగిన పోటీల్లో మొదటి బహుమతిని నారాయణపేట జిల్లా అనుగొండకు చెందిన రాములుగౌడ్ గెలుచుకోగా.. రూ.16 వేల నగదును సర్పంచ్ ప్రశాంతిరాజ్ అందజేశారు. రెండో బహుమతిని పడ్వాడ్ గుడిసె రంగన్న గెలుపొందగా రూ.12 వేలు, మూడో బహుమతిని కుచినెర్ల రాము గెలుపొందగా రూ.8 వేలు, నాలుగో బహుమతిని కర్నె నందిత సాధించగా రూ.ఆరు వేల నగదు, జ్ఞాపిక అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి, బీఆర్‌ఎస్ పార్టీ బీసీసెల్ మండల అధ్యక్షుడు ఆనంద్‌గౌడ్, ఉపసర్పంచ్ రంగారెడ్డి, ఎంపీటీసీ శ్యామల పాల్గొన్నారు.
