లీకేజీలో ‘ఉపాధి’..! | - | Sakshi
Sakshi News home page

లీకేజీలో ‘ఉపాధి’..!

Mar 29 2023 1:14 AM | Updated on Mar 29 2023 1:14 AM

- - Sakshi

ఈజీఎస్‌ ఉద్యోగుల్లో గుబులు

ఉపాధి హామీలో పనిచేస్తున్న డాక్యానాయక్‌, తిరుపతయ్య మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో వారు ఇంకా ఎంత మందికి పేపర్లు విక్రయించారనే దానిపై సిట్‌ బృందం క్షుణ్ణంగా జల్లెడ పడుతోంది. సిట్‌ అధికారులు డీఆర్‌డీఓ అధికారుల వద్ద కూడా వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈజీఎస్‌లో కాంట్రాక్ట్‌ పద్ధతిలో పనిచేస్తున్న ఎంతమంది ఉద్యోగులు టీఎస్పీఎస్సీ పరీక్షలు రాశారనే వివరాలు సేకరిస్తోంది. వారు సెలవు పెట్టి పరీక్షలు రాశారా.. విధులు నిర్వహిస్తూనే రాశారా.. ఎంత మందికి లీకై న ప్రశ్నపత్రాలు చేరాయి.. అనే పలు రకాల కోణాల్లో ఆరా తీస్తుండడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

ఈజీఎస్‌ చుట్టే టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారం

సిట్‌ దర్యాప్తులో ఒక్కొక్కరిగా పేర్లు వెలుగులోకి..

పట్టుబడిన వారిలో ఉమ్మడి పాలమూరువాసులే అధికం

తొలుత 9 మందిలో ఆరుగురు.. ఆ తర్వాత మరో ముగ్గురు

డీఆర్డీఓ అధికారుల నుంచి సైతం వివరాల సేకరణ

కాంట్రాక్ట్‌ సిబ్బందిలో గుబులు

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారం పాలమూరు జిల్లాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. సిట్‌ దర్యాప్తులో పాలమూరువాసుల పేర్లు ఒక్కొక్కరిగా వెలుగులోకి వస్తుండడం కలకలం రేపుతోంది. ప్రధానంగా ఉపాధి హమీ పథకంలో పనిచేసే కాంట్రాక్ట్‌ ఉద్యోగుల చుట్టే తిరుగుతుండడం సర్వత్రా చర్చనీయంశంగా మారింది. ఈ బాగోతంలో ఇప్పటివరకు పట్టుబడిన నిందితుల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన వారే అధికంగా ఉండగా.. వీరితో పాటు ఇంకెవరైనా ఉన్నారా? ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి? వంటి తదితర కోణాల్లో విచారణ అధికారులు జల్లెడ పడుతుండడం ఉత్కంఠ రేపుతోంది.

తొలుత ఆరుగురు..

టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన అసిస్టెంట్‌ ఇంజినీర్స్‌ (ఏఈ సివిల్‌) పరీక్ష పేపర్లు లీకై నట్లు తొలుత వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చేపట్టిన విచారణలో గ్రూప్‌–1, తదితర ప్రశ్నపత్రాలు సైతం లీకై నట్లు బహిర్గతమైంది. అయితే తొలుత అదుపులోకి తీసుకున్న నిందితుల్లో తొమ్మిదిమందిలో ఉమ్మడి పాలమూరుకు చెందిన వారే ఆరుగురు ఉండడం హాట్‌టాపిక్‌గా మారింది. పట్టుబడిన ప్రధాన నిందితుల్లో రేణుకా రాథోడ్‌, లవుడ్యావత్‌ డాక్యా దంపతులు. రేణుకది గండేడ్‌ మండలం మన్సూర్‌పల్లి తండా కాగా.. డాక్యాది అదే మండలంలోని పంచాంగల్‌ తండా. వీరితోపాటు రాజేశ్వర్‌, శ్రీనివాస్‌, నీలేశ్‌నాయక్‌, రాజేంద్రనాయక్‌ మన్సూర్‌పల్లి తండాకు చెందినవారే.

ఇంకొకరు.. మరో ఇద్దరు..

నవాబుపేట మండలంలో ఉపాధి హామీ పథకంలో కాంట్రాక్ట్‌ పద్ధతిన పనిచేస్తున్న ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్‌ ప్రశాంత్‌రెడ్డిని సిట్‌ బృందం ఈ నెల 24న అదుపులోకి తీసుకుంది. ఇతను టీఎస్‌పీఎస్సీ పేప ర్‌ లీకేజీలో ప్రధాన నిందితుడు రాజశేఖర్‌రెడ్డికి స్వ యానా బంధువు. ప్రశాంత్‌రెడ్డి విచారణలో వెల్లడించిన సమాచారం మేరకు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ఫరూక్‌నగర్‌ మండలం నేరళ్లచెరువుకు చెందిన రాజేందర్‌ను సిట్‌ అధికారులు అరెస్టు చేశా రు. ఇతను వారి గ్రామంలో ఇటీవలే విదేశాల నుంచి వచ్చిన ఓ వ్యక్తితో రూ.5 లక్షలు అప్పుగా తీసుకుని.. పేపర్‌ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ప్రశాంత్‌, రాజేందర్‌ను విచారించిన క్రమంలో గండేడ్‌ మండలంలో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న తిరుపతయ్య పేరు తెరమీదికి వచ్చింది. డాక్యానాయక్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఆయన లీకేజీ అయిన ఏఈ ప్రశ్నపత్రం విక్రయంలో అభ్యర్థులు, డాక్యానాయక్‌కు మధ్యవర్తిగా వ్యవహరించినట్లు సిట్‌ నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. మొత్తంగా సిట్‌ అధికారులు ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాకు చెందిన తొమ్మిది మందిని అరెస్టు చేయడంతో పాటు మరో ఇద్దరు కూడా వారి అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఉమ్మడి పాలమూరులో గండేడ్‌, నవాబ్‌పేట, మహబూబ్‌నగర్‌, షాద్‌నగర్‌ ప్రాంతాల్లో పర్యటించి విచారణ చేశారు. స్థానిక పోలీసులకు సైతం సమాచారం ఇవ్వకుండా రహస్యంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ బాగోతం మరికొందరి మెడకు చుట్టుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

ఉపాధి హామీ టీఏపై సస్పెన్షన్‌ వేటు?

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ వ్యవహారంలో అరెస్టు అయిన గండేడ్‌ మండల ఉపాధి హామీ టెక్నికల్‌ అసిస్టెంట్‌ తిరుపతయ్యను సస్పెండ్‌ చేయనున్నట్లు డీఆర్‌డీఓ యాదయ్య తెలిపారు. ఈ మేరకు మంగళవారం కలెక్టర్‌ రవినాయక్‌కు ఫైల్‌ పెట్టామని, కలెక్టర్‌ ఉత్తర్వుల మేరకు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అంతకు ముందు తిరుపతయ్య వ్యవహారంపై గండేడ్‌ ఎంపీడీఓ రూపేందర్‌రెడ్డి, ఏపీఓ హరిశ్చంద్రుడు డీఆర్‌డీఓకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీక్‌లో సిట్‌ అధికారులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారని, దీంతో రెండు రోజులుగా విధులకు హాజరు కావడం లేదని, సెల్‌ఫోన్‌ సైతం స్విచ్ఛాఫ్‌ ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement