
నారాయణపేట రూరల్: కళానిలయం సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ నటరాజ రామకృష్ణ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా వివిధ రంగాల్లో ఉత్తమ సేవలు చేస్తున్న వారిని గుర్తించి ఉగాది నంది పురస్కారాలు అందించారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో నారాయణపేట సునంద ఆస్పత్రి వైద్యులు డాక్టర్ ప్రసాద్‌శెట్టిని ఎంపిక చేసి, శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ సముద్రాల వేణుగోపాలచారి అభినందిస్తూ మరింత బాధ్యతగా విధులు నిర్వహించాలని, పేదలకు సైతం నాణ్యమైన, సరసమైన డబ్బులతో వైద్యసేవలు అందించి పేరు తెచ్చుకోవాలని సూచించారు. ఈ మేరకు పలువురు పట్టణ వైద్యులు అభినందనలు తెలిపారు.
పశువుల సంత,
తైబజార్‌లకు రేపు టెండర్లు
కోస్గి: స్థానిక మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో ఈనెల 28న మంగళవారం పశువుల సంత, తైబజార్‌లకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ పూర్ణచందర్ రావు, చైర్మన్ మ్యాకల శిరీష ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు. అత్యధిక ధర పాడిన వారికి ఒక సంవత్సర కాలానికి టెండరు అందజేస్తామని పేర్కొన్నారు. పాల్గొనదలిచిన వారు పశువుల సంతకు రూ.2లక్షలు, తైబజార్‌కు రూ.లక్ష చొప్పున మున్సిపాలిటీ కమిషనర్, కోస్గి పేరున డీడీలు తీసి 27న సాయంత్రం 4గంటల వరకు అందజేయాలని తెలిపారు. ఆసక్తి గల వ్యక్తులు ఇతర వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలని పేర్కొన్నారు.
కమల వికాసమే
ధ్యేయంగా పనిచేద్దాం
నారాయణపేట రూరల్: కేంద్రంతో పాటు తెలంగాణలో కమల వికాసమే ధ్యేయంగా ప్రతీ కార్యకర్త పనిచేయాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకరవర్ధన్ అన్నారు. పార్టీ పటిష్టతకు నిర్వహిస్తున్న శక్తి కేంద్రాల వర్క్‌షాప్‌ను ఆదివారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి బూత్‌స్థాయి కార్యకర్త నుంచి నాయకుల వరకు ఇంటింటికీ తిరుగుతూ స్థానికంగా నెలకొన్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు సంబందిత అధికారులు, ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తీసుకుని రావాలన్నారు. శక్తికేంద్రాలు, బూతు కమిటీలను బలోపేతం చేయాలని, భవిష్యత్‌లో బీఆర్‌ఎస్‌కు వీఆర్‌ఎస్ ఇచ్చేందుకు సిద్ధం కావాలన్నారు. సమావేశంలో రఘురామయ్యగౌడ్, లక్ష్మి, సుజాత, నందునామాజి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రారంభమైన ఇంటర్ పేపర్ వ్యాల్యువేషన్
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఇంటర్మీడియట్ పరీక్షలు మరో రెండు రోజుల్లో పూర్తికానున్న నేపథ్యంలో అధికారులు పేపర్ వ్యాల్యువేషన్‌కు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన పేపర్ వ్యాల్యువేషన్ క్యాంపును మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో చేపట్టారు. ఆదివారం నుంచి సంస్కృతం పేపర్ వ్యాల్యువేషన్ ప్రక్రియ మొదలైంది. అయితే వివిధ జిల్లాల నుంచి సంస్కృతం పేపర్‌కు సంబంధించి మొత్తం 23,831 పేపర్లు వచ్చాయి. ఇందులో మొదటి సంవత్సరం 13,321, రెండో సంవత్సరం 10,510 పేపర్లు ఉన్నాయి. వచ్చిన పేపర్లకు మొదట కోడింగ్ ప్రక్రియ చేసిన అనంతరం లెక్చరర్లతో వ్యాల్యువేషన్ చేసేందుకు ఇవ్వనున్నారు. వ్యాల్యువేషన్ మొదటిరోజు మొత్తం 26 మంది లెక్చరర్లు పాల్గొన్నారు. ఈ ప్రక్రియను డీఐఈఓ వెంకటేశ్వర్లు ఆదివారం పరిశీలించారు. రోజుల వారీగా జవాబు పత్రాలు క్యాంపునకు చేరుకుంటున్నాయని, సబ్జెక్టుల వారీగా వ్యాల్యువేషన్‌కు హాజరుకావాల్సిన లెక్చరర్లకు నేరుగా బోర్డు నుంచి ఆర్డర్లు వెళ్తాయని, వారు తప్పకుండా వ్యాల్యువేషన్ విధులకు హాజరుకావాలని, ప్రక్రియ సజావుగా సాగేందుకు సహకరించాలని ఆయన కోరారు.