ఉమ్మడి జిల్లాలో
ఎరువుల డిమాండ్ ఇలా..
జిల్లా జిల్లా
ఎరువులు
ఉక్కిరిబిక్కిరి చేస్తున్న యూరియా కొరత
కర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్ సీజన్‌కు రైతులు సిద్ధమవుతున్న తరుణంలో యూరియా కొరత వెక్కిరిస్తోంది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం కారణంగా ఇప్పటికే రసాయన ఎరువుల ధరలు భారీగా పెరిగిపోయాయి. ఇదే సమయంలో ఎరువుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతుండటం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటయ్యాక యూరియా కొరత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పంటల సాగు, డిమాండ్, సప్లై ప్లాన్ ప్రకారం ఎరువులు సరఫరా చేయకపోవడం, అంతంతమాత్రం వచ్చిన యూరియా టీడీపీ నేతల చేతుల్లోకి వెళ్లడంతో సాధారణ రైతులకు దిక్కులు చూడాల్సి వస్తోంది. నిబంధనల ప్రకారం ఎరువుల విక్రయాలన్నీ బయోమెట్రిక్ ద్వారా ఆన్‌లైన్‌లో చేపట్టాల్సి ఉంది. అయితే ప్రయివేటు డీలర్ల ఇష్టారాజ్యం కొనసాగుతోంది. ఆన్‌లైన్ లెక్కల్లో ఎరువులు పుష్కలంగా ఉన్నా.. క్షేత్రస్థాయిలో ఎక్కడా ఎరువులు దొరకని పరిస్థితి. ముందస్తు పత్తి సాగు చేస్తున్న రైతులు యూరియా కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం లేకపోతోంది.
ఆదిలోనే యూరియాకు కటకట
నీటి వసతి కింద మే నెల మొదటి నుంచే రైతులు సాగుకు సిద్ధమవుతారు. ఉమ్మడి జిల్లాలో నీటి వసతి కింద పత్తి ఇప్పటికే 1,000 హెక్టార్లలో సాగయింది. కూరగాయల పంటల సాగు కూడా చేపట్టారు. ప్రధానంగా యూరియా అవసరం ఎంతో ఉంది. ఉమ్మడి జిల్లాలో 99 సహకార సంఘాలు ఉన్నాయి. డీసీఎంఎస్ బ్రాంచీలు 18 ఉండగా.. రైతుసేవా కేంద్రాలు 689. వీటిల్లో ఎక్కడా ఒక్క బస్తా యూరియా లేకపోవడం గమనార్హం. మామూలుగా వ్యవసాయానికి మే నెల అన్ సీజన్. ఇప్పుడు ఎరువులు అందుబాటులో ఉండాలి. జిల్లాలో నీటి వసతి కింద పత్తి సాగు చురుగ్గా సాగుతున్నా రైతులకు చంద్రబాబు ప్రభుత్వం బస్తా యూరియా ఇవ్వలేని దుస్థితిలో ఉంది. డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా చేయడంలో చేతులెత్తేసిన చంద్రబాబు సర్కార్ యూరియా ఎక్కువగా వాడితే అనర్థాలు ఉత్పన్నమవుతున్నాయని, ఇది ప్రజారోగ్యంపై ప్రభావం చూపుతుందనే ప్రచారానికి తెగబడటం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఎరువుల ధరకు రెక్కలు
ఇప్పటికే అన్ని రకాల రసాయన ఎరువుల ధరలు పెరిగిపోయాయి. సామాన్య, మధ్య తరగతి రైతులు ఒక బస్తా ఎరువు కూడా కొనలేని పరిస్థితి. ఇక చిన్న, సన్నకారు రైతులకు ఎరువుల భారం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. ప్రస్తుతానికి యూరియా, డీఏపీ ధరల్లో మార్పు లేకపోయినప్పటికీ కాంప్లెక్స్ ఎరువుల ధరలు ఇప్పటికే పెరిగిపోయాయి. 28–28–0 ఎరువు 50 కిలోల బస్తా ధర రూ.2,300లకు చేరిందంటే ఎలా కొనాలనే రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 20–20–0–13, 14–35–14, 19–19–19, 10–26–26 తదితర కాంప్లెక్స్ ఎరువుల ధరతో పాటు పొటాష్ ఎరువు ధర అడ్డగోలుగా పెరిగాయి. 2026–27లో ఖరీఫ్ ప్రారంభానికి ముందే యూరియా కొరత ఏర్పడటం గమనార్హం.
ఎరువులు కర్నూలు నంద్యాల
యూరియా 58,872 54,458
డీఏపీ 15,408 30,023
ఎంవోపీ 2,516 3,617
ఎస్‌ఎస్‌పీ 2,220 3,176
కాంప్లెక్స్ 1,28,029 81,841
గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో
కొరత మాటే లేదు
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆర్‌బీకేల వారీగా ఏఏ పంటలు సాగు చేస్తున్నారు. ఎరువుల డిమాండ్ ఎంత అనే వివరాలు పక్కాగా సేకరించింది.
ఇందుకు అనుగుణంగా ఆర్‌బీకేల్లో యూరియూ, డీఏపీతో పాటు కాంప్లెక్స్ ఎరువులు రైతులకు అందుబాటులో ఉంచింది.
ఎరువుల పంపిణీలో పక్కా ప్లాన్ ఉండటంతో ఐదేళ్లు కొరత మాటే వినిపించలేదు.
నీటి వసతి కింద ముందస్తుగా
ముమ్మర పత్తి సాగు
ఉమ్మడి జిల్లాలో ఒక్క బస్తా
యూరియా లభించని పరిస్థితి
లెక్కల్లో మాత్రం 37,496
మెట్రిక్ టన్నుల యూరియా
అన్ సీజన్ అయినప్పటికీ
రైతులకు చుక్కలు
ఇప్పటికే అడ్డగోలుగా పెరిగిన
ఎరువుల ధర
37,496 మెట్రిక్ టన్నుల యూరియా ఎక్కడ?
వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపు 37 వేల మెట్రిక్ టన్నుల యూరియా ఉన్నట్లు స్పష్టమవుతోంది. అయితే ఉమ్మడి జిల్లాలో ఎక్కడా యూరియాతో పాటు డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు కనిపించని పరిస్థితి. 2026 ఖరీఫ్‌లో కర్నూలు జిల్లాలో 3,72,946 హెక్టార్లలో వివిధ పంటలు సాగయ్యే అవకాశం ఉంది. ఈ ప్రకారం కర్నూలు జిల్లాకు 2,07,029 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం కాగా.. యూరియా 58,872 టన్నులు అవసరం. నంద్యాల జిల్లాలో 2,52,444 హెక్టార్లలో వివిధ పంటల సాగుకు అవకాశం ఉండగా 54,458 టన్నుల ఎరువులు సిద్ధం చేయాల్సి ఉంది. ఇక కర్నూలు జిల్లాలో ప్రస్తుతం 62వేల టన్నుల ఎరువులు ఉండగా.. ఇందులో యూరియా 14,400 టన్నులు ఉన్నట్లు చెబుతున్నా క్షేత్రస్థాయిలో బస్తా కూడా లభించని పరిస్థితి నెలకొంది. టీడీపీ నేతల సిఫారసు ఉంటేనే యూరియా సహా ఇతర ఎరువులు లభిస్తుండటం గమనార్హం.


