జిల్లాలో ఉపాధి హామీ పథకం అమలవుతున్న పంచాయతీలు: 490 | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో ఉపాధి హామీ పథకం అమలవుతున్న పంచాయతీలు: 490

May 14 2026 1:01 AM | Updated on May 14 2026 1:01 AM

జిల్లాలో ఉపాధి హామీ పథకం అమలవుతున్న పంచాయతీలు: 490

కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు

బిల్లు పడేవరకై నా బతకాలి

ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి ఆళ్లగడ్డ మండలం బాచ్చాపురం గ్రామానికి చెందిన రైతు గజ్జల శేఖర్‌రెడ్డి. గతేడాది జాతీయ ఉపాఽధి హామీ పథకం కింద 72 కొబ్బరి మొక్కలు నాటాడు. ఇప్పటి వరకు సుమారు రూ. 40 వేల వరకు ఖర్చు అయ్యింది. అయితే మొక్కలు నాటిన వెంటనే మొక్కల కొనుగోలు, రవాణా, నాటేందుకు గుంతలు తవ్వడం వంటి ఖర్చులతో పాటు మెయింటెనెన్స్‌ కింద ఒక్కో మొక్కకు నెలకు రూ. 18, నీళ్లకు రూ. 16, ఎరువులకు ఏడాదికి రూ. 25 చొప్పున ఇస్తామని అధికారులు చెప్పారు. రైతు నాలుగు ఎకరాల పొలం చుట్టూ టెంకాయ మొక్కలు నాటాడు. అయితే ఇంతవరకు రూపాయి కూడా అందలేదు. బిల్లుల కోసం 6 నెలలుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.

నిమ్మ చెట్టుకు బిందెతో నీళ్లు పోస్తున్న ఈ రైతు మర్రిపల్లె గ్రామానికి చెందిన పత్తి శివరాముడు. ఇతను గత సంవత్సరం క్రితం 2 ఎకరాల్లో 130 నిమ్మ మొక్కలు నాటారు. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చుకుని చెట్లను బతికుంచుకున్నాడు. అయితే ఇప్పటి వరకు గుంతల, ఎరువులు, మొయింటినెన్స్‌ తదితరాల ఖర్చులకు సంబంధించి బిల్లులు రాకపోవడంతో ఆందోళన చెందుతున్నాడు. ఎండ లకు మొక్కలు ఎండి పోతుండటంతో రోజు బిందెలతో నీళ్లుపోస్తూ బతికుంచుకుంటున్నాడు. పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగినా.. ఇదిగో అదిగో అంటూనే ఏడాది దాటిపోయింది. బిల్లులు వచ్చే వరకై నా మొక్కలు బతికించుకునేందుకు కష్టాలు పడుతున్నాడు.

ఆళ్లగడ్డ: కూటమి ప్రభుత్వంలో తీవ్రంగా నష్టపోతున్న వారిలో రైతులు ముందుంటున్నారు. ప్రభుత్వం ప్రోత్సాహం కరువై ఉద్యాన రైతులు మొక్క దశలోనే అప్పుల భారంతో ఆందోళన చెందుతున్నారు. పండ్ల తోటల సాగుకు ఆసక్తి చూపే చిన్న, సన్నకారు, ఎస్సీ, ఎస్టీ రైతులను ప్రోత్సహించడమే లక్ష్యంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా అవసరమైన తోడ్పాటు అందజేస్తామని అధికారులు రైతులు వెంటపడ్డారు. పండ్ల మొక్కలు నాటుకుంటే మొక్కల ధర, రవాణా, గుంతలు తీసి నాటే కూలీలతో పాటు వాటి సంరక్షణకు ప్రతి నెల అకౌంట్‌లో డబ్బులు జమ చేస్తామని ఉపన్యాసాలు ఇచ్చారు. పాలకులు, అధికారుల మాటలు నమ్మిన రైతులు విరివిగా నిమ్మ, చీనీ, మామిడి, సపోట, జామ, దానిమ్మ వంటి పలు రకాల పండ్ల మొక్కలతో పాటు కొబ్బరి, మునగ, ఆయిల్‌ పామ్‌ వంటి మొక్కలు నాటుకున్నారు. మొక్కలు నాటుకునేంత వరకు ఒత్తిడి చేసిన అధికారులు ప్రతి నెలా ఇస్తామన్న ప్రోత్సాహ నగదు పైసా ఇవ్వలేదు. ఏడాదికి పైగా రైతులు బిల్లుల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటే ఈ వారం, వచ్చే వారం అంటూ అధికారులు సమాధానం చెబుతూ ముఖం చాటేస్తున్నారు. రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో నీరుగారిపోతోంది.

బిల్లులు దూరమై.. సంరక్షణ భారమై

పండ్ల మొక్కలు సాగు చేస్తే.. మొక్క ఎంపిక నుంచి నాటుకుని పంట చేతికొచ్చే వరకు (3 ఏళ్లు ) అయ్యే ఖర్చు పూర్తిగా (వంద శాతం) ప్రభుత్వమే ఏ నెలకు ఆ నెలలోనే ఇస్తుందని అధికారులు చెప్పారు. దీంతో అన్నదాతలు రూ.లక్షలు ఖర్చు చేసి పండ్ల మొక్కలు నాటుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 28 మండలాల పరిధిలో 1,472 మంది రైతులు 2.65 లక్షల పండ్ల మొక్కలను సాగు చేశారు. మొక్కలు కొనుగోలు చేయడం, రవాణా, నాటించడం, నీరందించడం, ఎరువులు, మందుల పిచికారీ చేయడం, సంరక్షణకు అన్నింటికీ రైతులే ఖర్చు భరించారు. బిల్లుల గురించి అడుగుతుంటే ఎవరూ సరైన సమాధానం చెప్పలేక పోతుండటంతో గంపెడాశతో పండ్ల మొక్కలు నాటుకున్న రైతులు నిరుత్సాహానికి గురవుతున్నారు. మామిడి, సపోట, జామ, నిమ్మ, కొబ్బరి మొక్కలు ఏవైనా వంద మొక్కలు నాటుకుంటే వాటి సంరక్షణకు ప్రతి నెల ఒక్కో మొక్కకు మెయింటెనెన్స్‌కు రూ. 18, నీళ్లకు రూ. 16, ఎరువులకు రూ. 25 లు చొప్పున రైతులకు అందించాలి. ఏడాదిగా ఈ బిల్లులు పూర్తిగా నిలిచిపోయాయి. జిల్లాలో 1,472 మంది రైతులకు సుమారు రూ. 54 కోట్లకు పైగానే రైతుల ఖాతాలకు ప్రభుత్వం జమ చేయాల్సి ఉంది.

అప్పులు చేయలేక..

సాధారణంగా ఏ పండ్ల తోటలు సాగు చేసినా ఎకరాకు రూ. 80 వేల నుంచి రూ. లక్ష వరకు ఖర్చు అవుతుంది. నెలనెలా ఉపాధి పథకం బిల్లులు అందుతాయని రైతులే సొంతంగా పెట్టుబడులు పెట్టుకున్నారు. అనేక మంది అప్పులు చేసి మొక్కలు నాటుకున్నారు. నెలనెలా వస్తుందనుకున్న బిల్లు ఏడాది దాటినా రాకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అనేక మంది రైతులు నీటి తడులకు పక్కనున్న బోర్లపై ఆధారపడాల్సి ఉంది. వీరు నీళ్ల బాడుగ చెల్లించక పోవడంతో నీళ్లు వదలడం లేదు. దీంతో అనేక మంది బిందెళతో నీళ్లు పోసుకుంటూ మొక్కలను పెంచుకుంటుండటంతో తేమ సరిపోక మొక్కలు ఎండిపోతున్నాయి. ఖర్చులు భరించలేకుంటున్నామని, మరి కొద్ది రోజులు చూసి పంటలను తొలగించుకోవడం జరుగుతుందని అధికారులతో వాపోతున్నారు.

ఉద్యాన పంటలు సాగుచేసిన

రైతులకు అందని బిల్లులు

ఏడాదిగా చెల్లించని

మెటీరియల్‌ బకాయిలు

అప్పులు చేసి సంరక్షిస్తున్న రైతులు

జిల్లాలో రూ. 54 కోట్లు పెండింగ్‌

Advertisement
 
Advertisement
Advertisement