హైకోర్టు ఉత్తర్వులు బేఖాతర్‌ | - | Sakshi
Sakshi News home page

హైకోర్టు ఉత్తర్వులు బేఖాతర్‌

May 14 2026 1:01 AM | Updated on May 14 2026 1:01 AM

కోవెలకుంట్ల: అధికారపార్టీ రాజకీయ ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గి హైకోర్టు ఉత్తర్వులను బేఖాతర్‌ చేస్తూ లింగాల గ్రామంలో రెండో సారి విగ్రహాల పునఃప్రతిష్ట కార్యక్రమాలు చేపట్టారు. గ్రామంలో సోమేశ్వర, రామాలయం, చెన్నకేశవ స్వామి ఆలయాలు శిథిలావస్థకు చేరుకోవడంతో రూ. 1.14 కోట్లు వెచ్చించి ఆలయాలను పునర్నిర్మించి 2024 ఫిబ్రవరి 19వ తేదీన విగ్రహాలను పునఃప్రతిష్టించారు. ఆలయాల జీర్ణోద్ధరణ గావించి రెండు సంవత్సరాలు దాటింది. అయితే సోమేశ్వరస్వామి ఆలయంలో విగ్రహాలు కదిలాయని వాటి స్థానంలో కొత్త విగ్రహాలు పునఃప్రతిష్టాంచాలని గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు పట్టుబట్టారు. గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు, ఇతర గ్రామ పెద్దలు ఇందుకు ఒప్పుకోలేదు. వీరి మాటలు లెక్కచేయకుండా టీడీపీ నాయకులు విగ్రహాలను తొలగించి పునఃప్రతిష్టకు సిద్ధమయ్యారు. దీంతో వైఎస్సార్‌సీపీ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. ఆలయాల్లో ఎలాంటి పునఃప్రతిష్ట కార్యక్రమాలు చేపట్ట వద్దని కోర్టు దేవాదాయశాఖకు ఈ నెల 4వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు అదే రోజు రాత్రి దేవాదాయశాఖ ఇన్‌స్పెక్టర్‌ హరిచంద్రారెడ్డి, ఈఓ మోహన్‌ పోలీసుల సహకారంతో గ్రామాన్ని చేరుకుని కోర్టు ఉత్తర్వుల మేరకు ఎలాంటి పునఃప్రతిష్ట చేయవద్దని కోర్టు ఇచ్చిన ఉత్తర్వు నోటీసులను ఆలయం వద్ద అంటించారు. దీంతో విగ్రహాల పునఃప్రతిష్ఠ కార్యక్రమాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. దీన్ని జీర్ణించుకోలేని టీడీపీ నాయకులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. చేసేదిలేక దేవదాయ శాఖ అధికారులు కోర్టు ఉత్తర్వులను ధిక్కరించి బుధవారం సాయంత్రం ఆలయ తలుపులు తెరిచి విగ్రహ పునఃప్రతిష్ట కార్యక్రమాలు చేపట్టారు. హైకోర్టు ఆదేశాలను బేఖాతర్‌ చేయడంతో గ్రామ పెద్దలు తిరిగి హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిసింది.

రాజకీయ ఒత్తిళ్లతో

రెండోసారి విగ్రహాల

పునఃప్రతిష్టకు ఏర్పాట్లు

Advertisement
 
Advertisement
Advertisement