● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల(న్యూటౌన్): పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు రెమడియల్ తరగతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సూచించారు. బుధవారం నంద్యాల పట్టణంలోని గుర్సాలపేటలో ఉన్న కేఎన్‌ఎం మున్సిపల్ హైస్కూల్‌లో నిర్వహిస్తున్న ఎస్‌ఎస్‌సీ రెమిడియల్ క్లాసులను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక తరగతుల నిర్వహణ విధానం, విద్యార్థుల హాజరు, బోధన పద్ధతులను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించి వారి చదువుల పురోగతి, సబ్జెక్టుల వారీగా ఎదురవుతున్న సమస్యలపై ఆరా తీశారు. పదవ తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టి వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించేలా బోధన చేయాలని పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులను ఆదేశించారు. ముఖ్యంగా తెలుగు, సైన్స్ సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థులకు అదనపు శిక్షణ అందించాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 10వ తరగతి పరీక్షల్లో 3,375 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించలేదన్నారు. ఈ విద్యార్థులంతా సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులు కావడానికి జిల్లా యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందన్నారు. పరీక్షలు పూర్తయ్యే వరకు విద్యార్థులను సెల్‌ఫోన్లు, టీవీలకు దూరంగా ఉంచి, ఇంటి పనులు చెప్పకుండా చదువుకు అనుకూల వాతావరణం కల్పించాలన్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యాశాఖ అధికారులు సమన్వయంతో పనిచేస్తే జిల్లాలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు.


