సెక్యూరిటీ గార్డు నిజాయితీ | - | Sakshi
Sakshi News home page

సెక్యూరిటీ గార్డు నిజాయితీ

May 13 2026 1:26 AM | Updated on May 13 2026 1:26 AM

శ్రీశైలం: భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో ప్రైవేటు భద్రతా విభాగంలో పనిచేస్తున్న రామ్‌ లాల్‌ తనకు దొరికిన బంగారు పుస్తెల హారాన్ని తిరిగి అప్పగించి నిజాయితీ చాటుకున్నారు. ఆలయ పర్యవేక్షకులు గంజి రవికుమార్‌ తెలిపిన వివరాల మేరకు.. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో మంగళవారం మధ్యాహ్నం దాదాపు రెండు తులాల బంగారు పుస్తెలతాడు సెక్యూరిటీ గార్డుకు దొరకడంతో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు అప్పగించారు. దేవస్థానం మైకుల ద్వారా బంగారు చైన్‌ పోగొట్టుకున్న వారు ఆధారాలతో వచ్చి తీసుకోవచ్చని ప్రకటించగా హైదరాబాద్‌లోని సైదాబాద్‌ సరస్వతి నగర్‌ కాలనీకి చెందిన కే.ధాత్రి రెడ్డి అక్కడికి వచ్చి హారం గురించి పూర్తి వివరాలు తెలపడంతో పుస్తెల హారాన్ని తిరిగిచ్చినట్లు చెప్పారు. పోగొట్టుకున్న హారం తిరిగి దక్కడంతో సదరు మహిళ దేవస్థానం పర్యవేక్షకులు, భద్రతా సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

ఆటో బోల్తా – వృద్ధురాలి దుర్మరణం

బనగానపల్లెరూరల్‌: మండలంలోని యాగంటి క్షేత్రం సమీపంలో ఆటో బోల్తా పడిన ప్రమాదంలో జ్ఞానేశ్వరమ్మ (74) మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై బనగానపల్లె టౌన్‌ సీఐ ప్రవీణ్‌కుమార్‌ తెలిపిన వివరాల మేరకు.. ప్రకాశం జిల్లా పొదిలి మండలం కంబాలపాడు గ్రామానికి చెందిన జ్ఞానేశ్వరమ్మతో పాటు మరో ఐదుగురు మంగళవారం యాగంటి క్షేత్రానికి వచ్చారు. యాగంటి స్వామి దర్శనం అనంతరం జ్ఞానేశ్వరమ్మతో పాటు మరో ఐదుగురు బనగానపల్లెకు వెళ్లేందుకు ఆటో ఎక్కారు. క్షేత్రం సమీపంలో ఉన్న మలుపు వద్ద ఆటో ఆదుపుతప్పి బోల్తాపడింది. ఆటోలో ప్రయాణిస్తున్న జ్ఞానేశ్వరమ్మ అక్కడిక్కడే మృతి చెందగా ఆటో డ్రైవర్‌ ప్రవీణ్‌కుమార్‌తో పాటు మరో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించి బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు.

గిరిజన సంక్షేమ అధికారులతో సమావేశం

శ్రీశైలంప్రాజెక్ట్‌: శ్రీశైలం ఐటీడీఏ కార్యాలయంలో మంగళవారం గిరిజన సంక్షేమ అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అధికారి పి.వి.ఎస్‌.నాయుడు నిర్వహించారు. జిల్లాలోని సంక్షేమ అధికారులకు సహాయ సంక్షేమ అధికారులుగా పనిచేయాలని, అలాగే జిల్లా కలెక్టర్‌ పరిధిలో కూడా విధులు నిర్వర్తించాలని పీఓ సూచించారు. గురుకులాలు, ఆశ్రమ పాఠశాల 10వ తరగతి ఉత్తీర్ణత, సంప్లిమెంటరీ విద్యార్థుల కోచింగ్‌పై దృష్టి సారించాలన్నారు. ఆర్టికల్‌ 275, పీఎంజేయూజీఏ పథకాల ద్వారా వచ్చిన నిధులను పాఠశాలల మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించి, వేసవి సెలవుల్లోగా పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. చెంచులకు సంబంధించిన ప్రజా విజ్ఞప్తులు నిర్ణీత సమయంలో పరిష్కరించాలన్నారు. నంద్యాల, ప్రకాశం, పల్నాడు జిల్లాల డీటీడబ్ల్యూఓలు, ఎడ్యుకేషన్‌ ఏపీఓ రామాంజనేయులు, ఆఫీస్‌ మేనేజర్‌ సీమోను తదితరులు పాల్గొన్నారు.

కోనేరులో జారిపడి వ్యక్తి మృతి

బనగానపల్లె: మండలంలోని నందవరం చౌడేశ్వరి ఆలయం ఎదురుగా ఉన్న కోనేటిలో మంగళవారం నడిగంటి బాలనరసింహుడు (43) ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందినట్లు సీఐ మంజునాథరెడ్డి తెలిపారు. వివరాలు.. వైఎస్సార్‌ కడప పట్టణంలోని అంగన్‌ వీధిలో నివసించే బాల నరసింహుడు మొక్కుబడి తీర్చుకునేందుకు కుటుంబంతో సహా చౌడేశ్వరి ఆలయానికి వచ్చారు. కోనేటిలో దిగి కాళ్లు, ముఖం శుభ్రం చేసుకుంటుండగా ప్రమాద వశాత్తు నీటిలో పడిపోయారు. ఆ సమయంలో కాపాడేందుకు ఎవరూ లేకపోవడంతో నీట మునిగి మృతి చెందాడు. కొంత సేపటికి కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి చూడగా శవమై తేలాడు. సమాచారం అందుకున్న పోలీసులు కోనేటిలో ఉన్న మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. భార్య రమాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement