వెల్దుర్తి: పలు ప్రైవేట్ బ్యాంకులలో గ్రామస్తుల ఇళ్లు తనఖా పెట్టించి లోన్ మంజూరు చేయించాడు. అందులో సగం తీసుకుని, మిగతా సగం కూడా తనకే ఇస్తే అధిక వడ్డీ చెల్లిస్తానని ఆశ జూపి మొత్తం కాజేశాడు. లోన్‌కు సంబంధించి పూర్తి ఈఎంఐ తానే కట్టేస్తానని నమ్మబలికి చివరకు పత్తా లేకుండా పోయాడు. ఈ క్రమంలో రుణం తీసుకున్న వారికి ఈఎంఐ చెల్లించాలంటూ బ్యాంకు వారు ఒత్తిడి చేస్తుండటంతో మోసపోయినట్లు తెలుసుకుని బాధితులు లబోదిబోమంటున్నారు.
ఈ ఘటనపై బాధితులు పాండు, మల్లయ్య, గిడ్డయ్య, ఎల్లయ్య, రాజు, రామాంజనేయులు, మాదన్న, మనోహర్, రామలింగం తదితరులు తెలిపిన వివరాల మేరకు.. మల్లెపల్లె గ్రామానికి చెందిన ఏజెంట్ బురకల శాంతకుమార్ దాదాపు 4 ఏళ్ల నుంచి డోన్‌కు చెందిన ఓ ప్రైవేట్ బ్యాంకులో, మరిన్ని బ్యాంకులలో ఇళ్లు తనఖా పెట్టి లోన్ ఇప్పిస్తానని, అందులో సగం తాను తీసుకుని, లోన్ మొత్తం కంతుల వారీగా బ్యాంకుకు చెల్లిస్తానని ఆశ చూపాడు. దీంతో మల్లెపల్లెలోని దాదాపు 70 మందికి పైగా గ్రామస్తులు తమ ఇళ్లు, ఇతర ఆస్తి పత్రాలు శాంతకుమార్‌కు అప్పగించారు. వాటిని ప్రైవేట్ బ్యాంకులలో తనఖా పెట్టించి (మార్టిగేజ్ చేయించి) దాదాపు రూ.4 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు లోన్ మంజూరు చేయించాడు. సొమ్ము లబ్ధిదారుల ఖాతాలో జమ కాగానే ఒప్పందం ప్రకారం సగం తీసుకున్నాడు. మిగతా సగం కూడా తనకే ఇస్తే అధిక వడ్డీ చెల్లిస్తానని ఆశ చూపి మొత్తం కాజేశాడు. మొదట్లో లోన్ ఈఎంఐ సక్రమంగా కడుతూ ఇతరుల నమ్మకం పెంచుకున్నాడు. నమ్మకం మరింత పెరిగేలా ఇళ్లు తనఖా పెట్టిన వారికి బాండ్ సైతం రాసిచ్చాడు. దీంతో వందల సంఖ్యలో మల్లెపల్లెతో పాటు మండల పరిధిలోని చెరుకులపాడు, రామళ్లకోట, కలుగొట్ల, పుల్లగుమ్మి, బుక్కాపురం ఇలా పలు గ్రామాల వాసులు ఇతని ద్వారా హోమ్‌లోన్ తీసుకుని నగదు సమర్పించుకున్నారు. క్షేత్రస్థాయి విచారణ లేకుండా కేవలం ధ్రువపత్రాలను చూసి లోన్ మంజూరు చేయడంపై ఈ స్కామ్‌లో బ్యాంకు వారి పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని పత్రాలు లేకపోయినా ఏజెంట్ శాంతకుమార్ అధికారుల వద్దకు తిరిగి మరీ ఏర్పాటు చేసినట్లు బాధితులు చెబుతున్నారు. ఎమ్మిగనూరు, కోడుమూరు, వెల్దుర్తి తదితర మండలాల్లో ఈ తరహాలో రూ.కోట్లలో స్కామ్ జరిగినట్లు చెప్పారు.
ఈ స్థితిలో శాంతకుమార్ పత్తా లేకుండా పోవడంతో గత వారం నుంచి తమకు బ్యాంకుల నుంచి ఈఎంఐ కట్టాలంటూ ఒత్తిడి ఎక్కువైందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధిత కుటుంబంలో ఒకరు పేడ రంగు తాగి ఆత్మహత్యకు సైతం ప్రయత్నించినట్లు చెప్పారు. తమ పరిస్థితీ అదేనని, అధికారులు చర్యలు చేపట్టి న్యాయం చేయాలని కోరారు. ఘటనపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
వందల మందికి రూ.కోట్లలో
కుచ్చుటోపీ
పరారీలో ఏజెంట్
ఈఎంఐ కట్టాలని
బ్యాంకుల నుంచి ఒత్తిడి


