గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రైతులకు నాణ్యమైన సేవలు అందిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందిన వైఎస్సార్ అగ్రిల్యాబ్ నేడు నిర్వీర్యమైంది. పంటల సాగులో రైతులకు విత్తనాలు,ఎరువుల నాణ్యత పరీక్షలు, పాడి రైతులకు అన్ని రకాల పరీక్షలు అందించి ఘనకీర్తి గడించిన వైఎస్సార్ అగ్రిల్యాబ్ నేడు మూతపడింది. రైతు సంక్షేమమే లక్ష్యంగా గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నియోజకవర్గానికి ఒక సమగ్ర వ్యవసాయ పరీక్ష కేంద్రం మంజూరు చేశారు. ఇందులో భాగంగానే ఆలూరులోని ఎల్లార్తి రోడ్డులోనున్న వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో రూ.57 లక్షల వ్యయంతో 2021 సెప్టెంబర్ 8న ప్రారంభించారు. గతంలో రైతు భరోసా కేంద్రాలతో అనుసంధానం చేసి విత్తనాలు,ఎరువుల పరీక్షలు, పశువుల రక్త నమూనాలు సేకరించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసిన అగ్రిల్యాబ్ ప్రభుత్వ మార్పు తర్వాత ఈ వ్యవస్థను నిర్లక్ష్యం చేయడంతో నిరుపయోగంగా మారి మూత పడింది. దీంతో రైతులకు ఆయా పరీక్షలు అందడం లేదు. – ఆలూరు రూరల్


