● అహోబిలం ఆలయ కుడ్యంపై 500 ఏళ్ల క్రితం నాడు
కురుకుంద వాసి దానంపై శాసనం
ఆత్మకూరురూరల్: కృష్ణా తీరం వెంట ఉన్న ప్రాంతాలను వేల సంవత్సరాలుగా బాదామి చాళుక్యులు, హోయసలలు, రాష్ట్రకూటులు, కాకతీయులు, రెడ్డి రాజులు వంటి అనేక రాజవంశాలు పాలించినట్లు చరిత్ర ఉంది. ఈ ప్రాంతంలోని ధనవంతులు ధర్మవితరణ చేసేవారనే సత్యం ఇటీవల బయల్పడిన ఒక శాసనం ద్వారా తెలుస్తోంది. దిగువ అహోబిలం ఆలయ గోపురం కుడివైపు గోడపై ఉన్న శాసనాలను స్పష్టంగా చదవడం కోసం రసాయనాలతో శుద్ధీకరణ జరిపారు. అందులో ఒక శాసనంలో ఆత్మకూరు మండలం కురుకుంద గ్రామ ప్రసక్తి ఉండడమే ఈ వార్తాంశం అయ్యింది. కన్నడ భాష లిపి ఉన్న ఈ శాసనం క్రీ.శ 1553 జులై 2న శనివారం వేయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కురుకుంద గ్రామానికి చెందిన దళవాయి లింగరస, గురజాల నరసనాయన కుమారుడైన పోచిరాజ నరసరాజయ మహా అరసు పుణ్యం కోసం అహోబిల నరసింహుడికి ప్రతిరోజు సహస్త్రనామ పూజ నిర్వహించేందుకు 12 వరమా – గద్వాణాలను దానంగా ఇచ్చినట్లు ఈ శాసనంలో ఉంది. దీన్ని భారత పురావస్తు శాక సర్వేక్షణ శాఖ డైరెక్టర్ (ఎఫిగ్రఫి) పరిష్కరించారు. కురుకుంద గ్రామంలో 500 ఏళ్ల నాటి గురుతులు ఏవీ ఇప్పుడు కనిపించక పోయినా ఈ గ్రామంలోనూ, పరిసరాల్లో ఉన్న రెండు చెరువులకు మాచా వీరప్ప చెరువులుగా పేరుండటం అవి ఎప్పటివో ఎవరు చెప్పలేకపోవడం, ఇప్పటికీ ఇవి వందల ఎకరాలకు జీవనాధారంగా ఉండడం వంటివి గ్రామ ప్రాచీనతను చాటుతున్నాయి.


