ఉమ్మడి జిల్లాలో నకిలీ పత్తి విత్తన ప్యాకెట్లు | - | Sakshi
Sakshi News home page

ఉమ్మడి జిల్లాలో నకిలీ పత్తి విత్తన ప్యాకెట్లు

May 13 2026 1:20 AM | Updated on May 13 2026 1:20 AM

ఉమ్మడి జిల్లాలో నకిలీ పత్తి విత్తన ప్యాకెట్లు

నకిలీలపై ప్రత్యేక దృష్టి

2025 ఖరీఫ్‌లో 2,86,622

హెక్టార్లలో పత్తి సాగు

ఈ సారి సాగు

మరింత పెరిగే అవకాశం

కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి

భారీగా పత్తి విత్తన ప్యాకెట్లు డంప్‌

గుట్టుచప్పుడు కాకుండా

హెచ్‌టీ పత్తి సాగు

సొంత ధృవీకరణతోనే మార్కెట్‌లోకి

బీటీ పత్తిన ప్యాకెట్లు

కర్నూలు(అగ్రికల్చర్‌): 2025 ఖరీఫ్‌ సీజన్‌లో ఉమ్మడి జిల్లాలో పత్తి 2,86,622 హెక్టార్లలో సాగయింది. ఈ సారి పత్తి సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. నీటి వసతి కింద ముందస్తు ఖరీఫ్‌లో పత్తి సాగు చేయడం విశేషం. 2026లో కర్నూలు జిల్లాలో 3 లక్షల హెక్టార్లు, నంద్యాల జిల్లాలో 20వేల హెక్టార్లలో పత్తి సాగయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడే హైబ్రిడ్‌ పత్తి, బీటీ పత్తి విత్తనోత్పత్తి కూడా అధికం. బీటీ–2 పత్తి విత్తనాల మార్కెటింగ్‌కు రాష్ట్రం మొత్తం మీద జరిగే మార్కెటింగ్‌ ఒక ఎత్తు అయితే ఉమ్మడి జిల్లాలో జరిగే మార్కెటింగ్‌ మరో ఎత్తు. ఉమ్మడి జిల్లాలో పత్తి విత్తన ప్రాసెసింగ్‌ యూనిట్లు 9 మాత్రమే ఉన్నాయి. ఈ కంపెనీల్లో ఇప్పటికే ప్యాకింగ్‌ కూడా పూర్తయింది. అయితే జిల్లాలో 250 కంపెనీలు దాదాపు 1000 దాకా బీటీ పత్తి విత్తన రకాలను మార్కెట్‌లోకి విడుదల చేశాయి. తెలంగాణా కేంద్రంగా ఉన్న వందలాది కంపెనీలు ఉమ్మడి కర్నూలు జిల్లాను మార్కెటింగ్‌కు కల్పతరువుగా వినియోగించుకుంటున్నాయి. గుజరాత్‌ కంపెనీలతో కన్సల్టెన్సీ, సబ్‌ డీలర్స్‌ లైసెన్స్‌ పేరుతో వందలాది కంపెనీలు బీటీ పత్తి విత్తన ప్యాకెట్ల మార్కెటింగ్‌లో నిమగ్నమయ్యాయి. గుజరాత్‌ కంపెనీలకు రాయల్టీ చెల్లిస్తూ.. ఇక్కడ ప్యాకింగ్‌ చేస్తున్నా అడిగే నాథుడే కరువయ్యాడు.

నాణ్యత దేవుడికెరుక

పత్తి విత్తన నాణ్యతతో వ్యవసాయ శాఖకు ఎలాంటి సంబంధం లేదు. ఆయా కంపెనీలే సొంతంగా ధృవీకరించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో మూడు, నాలుగేళ్ల క్రితం కావేరి–జాదు రకం బీటీ పత్తి విత్తనాలతో వేలాది మంది రైతులు నష్టపోయారు. పరిహారం చెల్లించాలని కోర్టులు ఆదేశించినప్పటికీ కంపెనీలు చేతులెత్తేశాయి. 2024 ఖరీఫ్‌ సీజన్‌లో కూడా ఒక పేరొందిన కంపెనీ విత్తనంతో సాగు చేసిన పత్తి పలు చోట్ల దెబ్బతినింది. అయితే ఆ కంపెనీ పెద్దలు వ్యవసాయ యంత్రాంగాన్ని ముడుపులతో లోబరుచుకొని ఇతర కారణాలతో పంట దెబ్బతిన్నట్లు రిపోర్టు ఇవ్వడం గమనార్హం.

పత్తిలో కలుపు సమస్య అధికం. హెచ్‌టీ పత్తిలో కలుపు నివారణకు గ్‌లైపోసేట్‌ మందును పిచికారి చేస్తే కలుపు నాశనం అవుతుంది తప్ప.. పత్తి పంటకు ఏమీ కాదు. హెర్బిసైడ్‌ టాలరెంట్‌ బీటీ పత్తి విత్తనాలు జీవవైవిధ్యానికి ప్రమాదకరమనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వీటికి అనుమతివ్వలేదు. రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు ఏర్పాటు తర్వాత అనుమతి లేకపోయినప్పటికీ కొన్ని కంపెనీలు రైతులతో హెచ్‌టీ పత్తి సాగు చేస్తుండటం గమనార్హం. ఇటీవల ఆదోనిలో నిర్వహించిన హెచ్‌టీ పరీక్షల్లో గ్‌లైపోసేట్‌ ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో 2500 బీటీ–2 విత్తన ప్యాకెట్ల అమ్మకాలను నిలిపి వేశారు. కర్నూలులోని వివిధ కంపెనీల్లో హెచ్‌టీ పాజిటివ్‌ వచ్చినట్లు సమాచారం.

పత్తిలో నకిలీ విత్తనాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాం. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు రెవెన్యూ, పోలీసు, వ్యవసాయ అధికారులతో ఆరు అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు ఏర్పాటు చేశాం. కర్నూలు, ఆదోనిల్లో పత్తి విత్తన ప్రాసెసింగ్‌ యూనిట్ల వారీగా తనిఖీ బృందాలు ఏర్పాటయ్యాయి. విత్తన దుకాణాల్లో ఇంటర్నల్‌ స్క్వాడ్‌లతో తనిఖీలు చేయిస్తున్నాం. హెచ్‌టీ పత్తి సాగును నియంత్రించేందుకు 175 శాంపుల్స్‌ సేకరించి పరీక్షించాం. కల్లూరులో రెండు, ఆదోనిలో నాలుగు హెచ్‌టీ పాజిటివ్‌ వచ్చింది. ఆ మేరకు తగిన చర్యలు తీసుకుంటున్నాం.

– సీఎల్‌ వరలక్ష్మి,

జిల్లా వ్యవసాయ అధికారి, కర్నూలు

Advertisement
 
Advertisement
Advertisement