నాణ్యతగా ఉన్న జొన్నలనే కొనుగోలు చేస్తాం | - | Sakshi
Sakshi News home page

నాణ్యతగా ఉన్న జొన్నలనే కొనుగోలు చేస్తాం

May 13 2026 1:20 AM | Updated on May 13 2026 1:20 AM

పాములపాడు: నాణ్యతగా ఉన్న జొన్నలను మాత్రమే కొనుగోలు చేస్తామని సివిల్‌ సప్లై డీఎం అశ్వర్ధ నారాయణ నాయక్‌ అన్నారు. మంగళవారం స్థానిక మండల వ్యవసాయాధికారి కార్యాలయంలో ఆయన రైతులతో మాట్లాడారు. మహేంద్ర జొన్నలు మాత్రమే తీసుకుంటామని పేర్కొన్నారు. పలువురు రైతులు తెచ్చిన జొన్నలను పరిశీలించారు. క్వింటా రూ.6,699 చొప్పున ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని చెప్పారు. కొన్ని కారణాల చేత కొనుగోలు ఆలస్యమైందన్నారు. వెంటనే రైతుల నుంచి జొన్నలు సేకరించాలని సూచించారు. ఆయన వెంట మండల వ్యవసాయాధికారి మహేశ్వరరెడ్డి, ఏపీఎం ఉమామహేశ్వరమ్మ ఉన్నారు.

21 నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు

నంద్యాల: ఇంటర్మీడియట్‌ మొదటి, ద్వితీయ సంవత్సర సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 21 నుంచి జూన్‌ 2వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి డి.రాము నాయక్‌ తెలిపారు. పరీక్షల నిర్వహణపై మంగళవారం తన చాంబర్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సంవత్సరం, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సర పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొదటి సంవత్సరానికి సంబంధించి 10,115, ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 5,928 విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారన్నారు. పరీక్షల నిర్వహణకు 43 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు చెఆప్పరు. గ్రామీణ ప్రాంతాల నుంచి పరీక్ష కేంద్రాలకు వచ్చే విద్యార్థులకు ఇబ్బంది లేకుండా బస్సులను నడపాలన్నారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లోని జిరాక్స్‌ సెంటర్స్‌ మూసి ఉంచేలా చూడాలన్నారు.

వీరహనుమాన్‌ శోభాయాత్ర

నంద్యాల(వ్యవసాయం): హనుమాన్‌ జయంతిని పురస్కరించుకొని విశ్వహిందూ పరిషత్‌, భజరంగదళ్‌ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం నంద్యాల పట్టణంలో వీరహనుమాన్‌ శోభాయాత్ర నిర్వహించారు. తొలుత ఎంపీ బైరెడ్డి శబరి ముఖ్యఅతిథిగా వీరాంజనేయస్వామి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం శోభాయాత్రను జెండా ఊపి ప్రారంభించారు. ఈ యాత్ర టెక్కె మార్కెట్‌యార్డు నుంచి బైర్మల్‌ వీధి గుండా ప్రశాంతంగా సాగింది. శోభాయాత్రలో కోలాటాలు, చెక్కభజనలు అలరించాయి. పోలీసులు ట్రాఫిక్‌కు అంతరాయం కాకుండా మరో రహదారి గుండా వాహనాలు తరలించారు. శోభాయాత్ర బైటిపేటలోని ఆంజనేయస్వామి గుడి వద్దకు చేరుకుంది. విశ్వహిందూ పరిషత్‌ నాయకులు రావినూతల శశిధర్‌, ఆచార అభినవ శంకరానందస్వామి, బుగ్గన చంద్రహౌలీశ్వరరెడ్డి, ఎర్రం విష్ణువర్ధన్‌రెడ్డి, పోలేపల్లి సందీప్‌, చిలుకూరి శ్రీనివాస్‌, తులసిరెడ్డి, రామచంద్రారెడ్డి, మేడా మురళీధర్‌, విశ్వహిందూ పరిషత్‌, భజరంగదళ్‌ నాయకులు పాల్గొన్నారు.

వడదెబ్బతో

వ్యవసాయ కూలీ మృతి

పాములపాడు: వడదెబ్బతో కోల్స్‌ ఆనందాపురం గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ విజయానందం(54) మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. విజయానందం సోమవారం ఉదయం ఉపాధి పనులకు వెళ్లాడు. అనంతరం మొక్కజొన్న మిషన్‌ పనులకు వెళ్లి ఎండలు ఎక్కువగా ఉండటంతో త్వరగా ఇంటికి వచ్చాడు. అస్వస్థతకు గురై మంగళవారం తెల్లవారు జామున మృతి చెందాడు. ఈయనకు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement