నంద్యాల: రాత్రింబవళ్లు కష్టపడి చదివి డాక్టర్ కావాలనే కలను నిజం చేసుకునేందుకు నీట్ (నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రెస్ట్ టెస్ట్) రాసిన విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. ఫలితాల కోసం వేచి చూస్తున్న వేళ నీట్ యూజీ 2026 పరీక్ష రద్దు నిర్ణయం జిల్లాలో వేలాది మంది విద్యార్థులపై పిడుగులా పడింది. పేపర్ లీక్ పాపం ఎక్కడో జరిగితే దానికి తామెందుకు శిక్ష అనుభవించాలని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షలాది రూపాయలు అప్పులు చేసి తమ పిల్లలను డాక్టర్‌గా చూడాలని ఆశపడ్డ తల్లిదండ్రులు ఇప్పుడు ప్రభుత్వ తీరుపై మండి పడుతున్నారు. నిన్నటి వరకు ఆనందంగా ఉన్న విద్యార్థుల ఇళ్లలో ఇప్పుడు నిరాశ, నిస్పృహలు అలుముకున్నాయి.
దిక్కుతోచని స్థితి
నంద్యాల జిల్లాలో ఈ ఏడాది మే 3న నీట్ నిర్వహించారు. నంద్యాల గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, పీఎస్సీ, కెవీఎస్సీ డిగ్రీ కాలేజ్, ఎస్‌వైవిసీపీ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, బస్టాండ్ సమీపంలోని గవర్నమెంట్ హైస్కూల్‌లలో ఏర్పాటు చేసిన ఐదు కేంద్రాల్లో 1,434 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. పరీక్ష రాసిన పది రోజుల తర్వాత రాజస్థాన్, మరికొన్ని రాష్ట్రాల్లో పేపర్ లీక్ అయ్యిందన్న సమాచారంతో నీట్‌ను ఎన్‌టీఏ(నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) రద్దు చేసింది. ఈ పరీక్షను మళ్లీ పెడతామని, తేదీని త్వరలో ప్రకటిస్తామని చెప్పింది. పరీక్ష ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని, దరఖాస్తు కూడా కొత్తగా చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. దీంతో పరీక్ష రాసిన విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. రెండు సంవత్సరాల పాటు కష్టపడి రాసిన పరీక్ష రద్దు కావడంతో విద్యార్థులు దిక్కుతోచని స్థితి ఉన్నారు. పరీక్ష బాగా రాశామని సంతోషపడే లోపే రద్దు వార్త వినాల్సి రావడం బాధాకరమని విద్యార్థులు వాపోతున్నారు.
నీట్ పరీక్ష రాసి మానసికంగా రిలాక్స్ అయ్యాం. ఇప్పుడు మళ్లీ పరీక్ష అంటే ఆ ప్రశ్నపత్రం స్థాయి ఎలా ఉంటుందో? ఎగ్జామ్ పేపర్ ఎలా వస్తుందో? ఒక వేళ ఇప్పుడు రాసిన పరీక్షకంటే కఠినంగా వస్తే మా ర్యాంకులు దెబ్బతినే అవకాశం ఉంది.
–మౌనిక, నీట్ విద్యార్థిని, నంద్యాల
పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారో ఎన్‌టీఏ స్పష్టత ఇవ్వలేదు. రీ ఎగ్జామ్, ఫలితాలు, కౌన్సెలింగ్ ఇవన్నీ జరిగే సరికి విద్యా సంవత్సరం సగం గడిచిపోతుందేమోనని భయంగా ఉంది. ప్రభుత్వం వెంటనే కొత్త షెడ్యూల్ ప్రకటించి విద్యాసంవత్సరం వృథా కాకుండా చర్యలు తీసుకోవాలి. పరీక్ష రద్దు చేయడం నిజాయితీగా చదివిన మాకు అన్యాయం జరిగింది.
–కె.భరత్, నీట్ విద్యార్థి, నంద్యాల
నీట్ రద్దుపై విద్యార్థుల్లో ఆందోళన జిల్లాలో పరీక్షకు హాజరైన విద్యార్థులు 1,434 మంది


