జూపాడుబంగ్లా: ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు తొలుత జిల్లా ఉన్నతాధికారులు పత్రికా ప్రకటన ఇవ్వాలి. లేదంటే రాష్ట్రప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయాలి. అయితే కస్తూర్బా పాఠశాలల ఉపాధ్యాయుల బదిలీల్లో ఇవేమీ జరగలేదు. తాను చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నరీతిలో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిందని టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కస్తూర్బా పాఠశాలల్లో కాంట్రాక్టు బేసిక్ మీద విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఓ(స్పెషల్ ఆఫీసర్)టీచర్లు, పీఈటీలకు పదేళ్ల నుంచి సాధారణ బదిలీలు చేపట్టలేదు. దీంతో వారు తమకు బదిలీలు ఎప్పుడొస్తాయా అని ఎదురుచూస్తున్నారు. అయితే రాష్ట్రప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించింది. కనీసం పత్రికా ప్రకటన ఇవ్వకుండా, నోటిఫికేషన్ జారీ చేయకుండా వాట్సాప్‌లో దరఖాస్తులు పంపించింది. వాటిని పూర్తి చేయాలని జిల్లా అధికారులు వాట్సాప్ కాల్ ద్వారా ఉపాధ్యాయులను ఆదేశించారు. ఫోన్ కాల్ చేస్తే రికార్డు చేస్తారేమోననే భయంతో వాట్సాప్ కాల్ చేశారని విమర్శలు వచ్చాయి.
రహస్యంగా బదిలీలు
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 53 కస్తూర్బాగాంధీ పాఠశాలలున్నాయి. ఒక్కో పాఠశాలలో ఎస్‌ఓలతో కలిపి తొమ్మిది మంది చొప్పున 477 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. వారికి ఈనెల 2, 3 తేదీల్లో కర్నూల్లోని సర్వశిక్షాభియాన్ కార్యాలయంలో రహస్యంగా బదిలీలు నిర్వహించారు. వాట్సాప్‌లో వచ్చిన దరఖాస్తులు పూరించి ఈ బదిలీల్లో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రక్రియ జరిగి పదిరోజులు గడిచినా ఇప్పటిదాకా బదిలీపై వెళ్లిన వారికి ఎలాంటి ట్రాన్స్‌ఫర్ ఆర్డర్ కాపీలు మంజూరు చేయలేదు. దీంతో బదిలీ అయిన ఉద్యోగులు జిల్లా అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హైకోర్టును ఆశ్రయించి..
ఎలాంటి పత్రికా ప్రకటన, నోటిఫికేషన్, గైడ్‌లెన్స్ లేకుండా బదిలీలు చేపట్టి తమకు ట్రాన్స్‌ఫర్ ఆర్డర్ కాపీలు ఇవ్వకపోవటంతో ఆగ్రహించిన కస్తూర్భాగాంధీ పాఠశాలల ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. రెండు, మూడు రోజుల్లో హైకోర్టు ఉత్తర్వుల మేరకు జిల్లా అధికారులు చేపట్టిన బదిలీలపై స్టే మంజూరయ్యే అవకాశాలున్నాయని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో ఇదేమాదిరిగా బదిలీలు చేపట్టడంతో ఆగ్రహించిన ఆ జిల్లా కస్తూర్బా పాఠశాలల ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించడంతో బదిలీలపై స్టేను విధించినట్లు సమాచారం. దీన్ని ఆసరాగా చేసుకొని ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కస్తూర్భా పాఠశాలల ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది.
నోటిఫికేషన్ ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం
వాట్సాప్‌కాల్స్ చేసి
విషయం తెలిపిన వైనం
వాట్సాప్‌లో చేరిన దరఖాస్తులు
ఉమ్మడి జిల్లాలోని 53 కస్తూర్బా
పాఠశాలల్లో బదిలీలు
ఇప్పటిదాకా అందని
ట్రాన్స్‌ఫర్ ఆర్డర్ కాపీలు
కోర్టుకు వెళ్లిన ఎస్‌ఓలు,
ఉపాధ్యాయులు


