శ్రీమఠం హుండీ ఆదాయం రూ.2.78 కోట్లు | - | Sakshi
Sakshi News home page

శ్రీమఠం హుండీ ఆదాయం రూ.2.78 కోట్లు

May 13 2026 1:20 AM | Updated on May 13 2026 1:20 AM

మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీ రాఘవేంద్రస్వామి హుండీ ఆదాయం రూ.2,78,19,526 సమకూరింది. మంగళవారం శ్రీమఠం రాజాంగణ భవనంలో హుండీ లెక్కింపు చేపట్టారు. ఏప్రిల్‌ 22 నుంచి మే 11 వరకు సంబంధించి 20 రోజుల హుండీ కానుకలు శ్రీమఠం అధికారులు లెక్కగట్టారు. అందులో నగదు రూపేణా రూ 2,69,28,176, నాణేలా రూపంలో రూ.8,91,350 వచ్చిందన్నారు. అలాగే 15 గ్రాముల బంగారం, 751గ్రాముల వెండి కానుకలు సమకూరినట్లు మేనేజర్‌ ఎస్‌.కె శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్‌–2 వెంటేష్‌ జోషి, ఇంజనీర్‌ సురేష్‌కోనాపూర్‌ పాల్గొన్నారు.

కొత్తిమీర ధరకు రెక్కలు

ఒక మడి ధర రూ.1600

గోనెగండ్ల: కొత్తిమీర ధరకు రెక్కలు వచ్చాయి. ఒక మడి ధర రూ. 1500 నుంచి రూ.1600 వరకు పలుకుతోంది. ఎండలు ఎక్కువకావడం, బోర్లు, బావుల్లో నీరు ఎండిపోవడం, పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో కొత్తిమీరకు డిమాండ్‌ పెరిగింది. గోనెగండ్ల మండలంలో ప్రస్తుతం బోర్లు, బావుల కింద 100 ఎకరాల్లో ఈ పంట సాగులో ఉంది. ఒక ఎకరా సాగుకు రూ.40 వేల పెట్టుబడి వస్తుంది. ఈ ఏడాది ఉల్లి తదితర పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. రెండు రోజుల నుంచి కొత్తిమీరకు ధర పెరగడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

దాడికి పాల్పడిన

టీడీపీ నాయకులపై కేసు

వెల్దుర్తి: మల్లెపల్లె వైఎస్సార్సీపీ కార్యకర్త వీరేశ్‌ ఆచారిపై సోమవారం దాడికి పాల్పడిన అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు రామదుర్గనాయుడు, అయ్యన్న, చంద్రారెడ్డి, మాధవ్‌పై కేసు నమోదు చేసి నట్లు ఎస్‌ఐ నరేశ్‌ మంగళవారం తెలిపారు. హైవే 44 పక్కన మల్లెపల్లె స్టేజ్‌ సమీపంలో వీరేశ్‌ ఆచారి, భార్య గాయత్రి, ఇద్దరు పసిపిల్లలతో కలిసి బైక్‌పై వస్తుండగా నిందితులు దారికాచి బైక్‌ను అటకాయించి వీరేశ్‌ ఆచారిపై దాడికి పాల్పడ్డ విషయం తెలిసిందే. జరిగిన సంఘటనపై గాయత్రి ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement