వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం హెక్టారుకు 5 ప్యాకెట్ల బీటీ–2 పత్తి విత్తనాలు వినియోగించాల్సి ఉంది. ఉమ్మడి జిల్లాకు దాదాపు 30 లక్షల ప్యాకెట్లు అవసరం కాగా.. వ్యవసాయ అధికారులు కర్నూలు జిల్లాకు 11 లక్షల ప్యాకెట్లు, నంద్యాల జిల్లాకు 50 వేల ప్యాకెట్లు కేటాయించాలని వ్యవసాయ శాఖను కోరారు. దీంతో జిల్లాలో పత్తి విత్తనాల కొరత ఏర్పడే పరిస్థితి నెలకొంది. దీనిని అవకాశంగా తీసుకొని అక్రమార్కులు తెలంగాణ, కర్ణాటక నుంచి అనధికార బీటీ–2 విత్తనాలను జిల్లాలోకి డంప్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆదోని, కౌతాళం, పెద్దకడుబూరు, మంత్రాలయం, దేవనకొండ, కోడుమూరు, సి.బెళగల్, కల్లూరు, క్రిష్ణగిరి మండలాల్లోకి అనధికార పత్తి విత్తన ప్యాకెట్లు పెద్ద ఎత్తున డంప్ అయినట్లు సమాచారం. వందల కంపెనీలు, అనేక రకాల పేర్లతో పత్తి విత్తన ప్యాకెట్లను మార్కెట్‌లోకి తీసుకొస్తున్నా వ్యవసాయ శాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది.


