ఆగస్టు వరకు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశం
నీటి ఆధారం కింద ఉల్లి, వరి, పత్తి సాగు చేయొవద్దని వ్యవసాయ శాఖ ప్రచారం
గత ఏడాది మే నెలలో విస్తారంగా వర్షాలు
ఎల్‌నినో ప్రభావంతో ఈ సీజన్‌లో జాడలేని చినుకు
ఖరీఫ్ పంటల సాగుకు ఆగస్టు వరకే అవకాశం
2025 ఖరీఫ్‌లో పంటల సాగు ఇలా..
కర్నూలు(అగ్రికల్చర్): గత ఏడాది మే నెలలో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఈ సారి మే నెలలో గాలుల తీవ్రత ఉన్నా.. చినుకు జాడ కరువైంది. ఎల్‌నినో ప్రభావం మొదలు కావడం వల్లే ఈ పరిస్థితి నెలకొన్నట్లు వ్యవసాయ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. 2026–27 సంవత్సరంలో ఎల్‌నినో ప్రభావంతో కరువు ఎదుర్కోక తప్పని పరిస్థితి ఏర్పడింది. మామూలుగా జూన్ 1వ తేదీ నుంచి తొలకరి మొదలవుతుంది. నైరుతి రుతుపవనాలు మే నెల చివరికే విస్తరించాల్సి ఉంది. ఈ సారి రుతుపవనాలు ఆలస్యంగా వచ్చే పరిస్థితి ఏర్పడింది. కొద్ది రోజులు ఆలస్యంగా వచ్చినా చురుగ్గా ఉండే అవకాశం లేదు. ఎల్‌నినోపై రాష్ట్ర ప్రభుత్వానికి ముందస్తు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో కనీసం తాగునీటికి ఇబ్బందులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉన్నా ఆ దిశగా కూడా చర్యలు కరువయ్యాయి. అయితే నీటి వసతి కింద ఉల్లి, పత్తి, వరి పంటలు సాగు చేయవద్దని ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా ప్రచారం చేస్తోంది. ఉమ్మడి జిల్లాలో పత్తి, ఉల్లి, మిర్చి, వరి, వేరుశనగ, మొక్కజొన్న తదితరాలు ప్రధాన పంటలు. ఎల్‌నినో కారణంగా వర్షాధార పంటలకే కాకుండా నీటి ఆధారిత పంటలకు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పొడి వాతావరణం, అధిక వేడి వల్ల కొన్ని రకాల పురుగులు, తెగుళ్లు సోకి పంటలను మరింత దెబ్బతీసే ప్రమాదం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పంటల సాగు పడిపోయే ప్రమాదం
2025 ఖరీఫ్‌లో కర్నూలు జిల్లాలో 4,49,858 హెక్టార్లలో, నంద్యాల జిల్లాలో 2,78,204 హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే ఈ సీజన్‌లోనూ ఇదే స్థాయిలో పంటలు సాగవుతాయి. నంద్యాల జిల్లాలో నీటి ఆధారం పంటలే ఎక్కువ. ఎల్‌నినో ప్రమాదం వల్ల నంద్యాల జిల్లాలో వ్యవసాయం ప్రశ్నార్థకమవుతోంది. ఈసారి సాగు విస్తీర్ణం పడిపోయే ప్రమాదం ఏర్పడింది. వర్షాలు పడుతాయా లేదోన్న ఉద్దేశంతో విత్తుకు రైతులు ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. కొన్ని పంటలు జూలై చివరి వరకు, మరికొన్ని ప ంటలు ఆగస్టు చివరి వరకు వేసుకునే అవకాశం ఉంది. వాతావరణ శాస్త్రవేత్తల సమాచారం మేరకు ఆగ స్టు వరకు ఎల్‌నినో ప్రమాదం ఉండటం వల్ల వివిధ పంటల సాగుకు అవకాశమే లేనట్లు తెలుస్తోంది.
నీటి వసతి పంటలు కూడా కష్టమే..
ఉమ్మడి జిల్లాలో నీటి వసతి కింద వరి, మొక్కజొన్న, పత్తి, మిర్చి తదితర పంటలు సాగు చేస్తారు. ఇక్కడి సాగు నీటి ప్రాజెక్టులు నిండాలంటే ఎగువ ప్రాంతమైన కర్ణాటకలో భారీ వర్షాలు కురవాల్సి ఉంది. ఎల్‌నినో ప్రమాదం తెలుగు రాష్ట్రాలతో పాటు, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాలపైనా ఉండటంతో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇందువల్ల వర్షాధార పంటలకే కాకుండా నీటి ఆధారిత పంటల సాగుకూ గడ్డుకాలం తప్పని పరిస్థితి. ఈ నేపథ్యంలో వ్యవసాయ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు నీటి ఆధారిత పంటలు వద్దు.. తక్కువ తేమతో సాగుకు అవకాశం ఉన్న స్వల్పకాలిక పంటలు సాగు చేసుకోవాలని సూచిస్తుండటం గమనార్హం. అంటే ఈ ఖరీఫ్‌లో నీటి ఆధారం కింద వరి, ఇతర పంటలకు అవకాశం లేనట్లేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈ సారి ఎల్‌నినో ప్రభావం ఆగస్టు వరకు కొనసాగే అవకాశం ఉంది. ఈ ప్రభావం వల్ల వర్షాలు సాధారణం కంటే తక్కువగా కురిసే అవకాశం కనిపిస్తోంది. ఒకే రోజు కనీసం 40 మి.మీ వర్షపాతం నమోదైనప్పుడే పత్తి, ఇతర పంటలు సాగు చేసుకోవాలి. జిల్లాలో ప్రధాన పంట పత్తి అయినందున ఈ పంటలో జొన్న, సజ్జ, ఆముదం వంటి అంతర పంటలు సాగు చేయాలి. నీటి వినియోగం ఎక్కువగా ఉండే పంటలు సాగు చేయవద్దని రైతులకు చెబుతున్నాం. – పీఎల్ వరలక్ష్మి, జిల్లా వ్యవసాయ అధికారి, కర్నూలు
నాకు మూడు ఎకరాల పొలం ఉంది. పత్తి, కంది సాగు చేస్తుంటా. ఈసారి వర్షాలు ఉండవని చెబుతున్నారు. ఇప్పటికే ఆ పరిస్థితి కనిపిస్తోంది. అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నట్లు లేదు. ఉచిత పంటల బీమాను అమలు చేస్తే రైతులకు ప్రయోజనకరంగా ఉంటుంది. స్వల్పకాలిక పంటల సాగుకు 75 శాతం సబ్సిడీపై విత్తనాలు పంపిణీ చేయాలి.
– ఎంబాయి రామాంజనేయులు, అమీనాబాద్, తుగ్గలి మండలం
ముంచుకొస్తున్న ఎల్‌నినో
కర్నూలు జిల్లా
పంట సాగు(హెక్టార్లలో.)
పత్తి 280086
కంది 68854
ఉల్లి 24810
మిర్చి 17998
వేరుశనగ 44541
నంద్యాల జిల్లా
పంట సాగు(హెక్టార్లలో.)
వరి 95031
మొక్కజొన్న 98171
కంది 47691
మినుము 11134
నందికొట్కూరు సమీపంలో పొలంలో పంట వ్యర్థాలను తొలగిస్తున్న కూలీలు
చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటయ్యాక రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పంటల బీమా, ఉచిత పంటల బీమాకు మంగళం పలకడంతో కరువు నుంచి బయటపడే అవకాశం లేకుండా పోయింది. ఈ సారి ఎల్‌నినో ప్రమాదం పొంచి ఉండటం రైతులను ఇప్పటికే ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మామూలుగా ఈ సమయానికి రైతులు పత్తి, ఉల్లి తదితర విత్తనాలు సిద్ధం చేసుకుంటారు. ఇప్పుడు మాత్రం వర్షాలు కురిసిన తర్వాత విత్తనాలు తీసుకుందామనే అభిప్రాయంలో ఉన్నారు. నీటి వసతి ఉన్న రైతులు పత్తి విత్తనాలు కొంటున్నారు తప్ప వర్షాధారం కింద సాగు చేసే రైతులు విత్తన సేకరణకు ఆసక్తి చూపని పరిస్థితి. ఎల్‌నినో సమయంలో వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అధిక ఉష్ణోగ్రత నేలలోని తేమను త్వరగా ఆవిరి చేస్తుందనే ఆందోళన నెలకొంది.


