జూనియర్ కాలేజీల్లో కనిపించని పీడీలు
నియామకాలు చేపట్టని రాష్ట్ర ప్రభుత్వం
క్రీడలకు దూరమవుతున్న వేలాది మంది విద్యార్థులు
విద్యార్థులకు అన్యాయం
నంద్యాల(న్యూటౌన్): జూనియర్ కాలేజీల్లో క్రీడా శిక్షణకు సరైన వసతులను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చడం లేదు. పాఠశాల స్థాయిలో క్రీడల్లో రాణించిన విద్యార్థులు కళాశాలల్లో సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో మొత్తం 21 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో తొమ్మిది కళాశాలలకు పీడీ పోస్టులను రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు జారీ చేశారు. వీటిల్లో ప్రస్తుతం ఒక్క కళాశాలకు మాత్రమే పీడీ పోస్టు ఉంది. దీంతో వేలాది మంది విద్యార్థులు క్రీడలకు దూరమవుతున్నారు.
జీతాల ఖర్చును తగ్గించుకునేందుకే!
జూనియర్ కళాశాలల్లో ఫిజికల్ డైరెక్టర్ (పీడీ)గా పనిచేస్తూ ఉద్యోగ విరమణ పొందితే ఆ కళాశాలలో ఇక పీడీ పోస్టుకు మంగళం పలకనున్నారు. నంద్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న పీడీ గత నెలలో ఉద్యోగ విరమణ పొందాడు. దీంతో ఆ పోస్టుకు మంగళం పలికారు. విశాలమైన క్రీడా మైదానం ఉన్నప్పటికీ పీడీ పోస్టులను కన్వర్ట్ చేసి తగ్గించుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఉన్న పోస్టులను పక్కదారి మళ్లించి జీతాల ఖర్చును తగ్గించుకునే పనిలో పడింది.
వ్యాయామ విద్య అందని ద్రాక్ష
ఉన్నత పాఠశాలల్లో పీఈటీ, పీడీ పోస్టులు ఉన్నాయి. పాఠశాల స్థాయిలో విద్యార్థులు క్రీడల్లో రాణిస్తున్నారు. తిరిగి డిగ్రీ కళాశాలల్లో కూడా పీడీ పోస్టులు ఉన్నాయి. అయితే ఇంటర్ కళాశాలల్లో పీడీ పోస్టులు లేకపోవడంతో విద్యార్థులు క్రీడల్లో రాణించలేకపోతున్నారు. క్రీడా మైదానాలు ఉన్న జూనియర్ కళాశాలల్లోనే పీడీ పోస్టులు ఉండేవి. అవి కూడా ప్రస్తుతం లేకుండా చేస్తున్నారు. ఇంటర్ చదివే విద్యార్థులకు వ్యాయామ విద్య అందని ద్రాక్ష మారింది.
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు చంద్రబాబు సర్కార్ అన్యాయం చేస్తోంది. జూనియర్ కళాశాలల్లో వ్యాయామ విద్యా అధ్యాపకుల పోస్టులకు ఇతర సబ్జెక్టులను మార్పు చేయడం తగదు. ఎంపీఈడీ అర్హతతో ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయులను ఉద్యోగ పదోన్నతి ద్వారా నియమించాలని డిమాండ్ చేస్తున్నాం. జూనియర్ కళాశాలలో పీడీలను నియమించకపోతే ఆందోళనలు చేస్తాం.
– ఎర్రిస్వామి, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి, నంద్యాల


