● శ్రీశైలంలో సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ ● కలశయాత్రలో పాల్గొన్న వెయ్యి మంది భక్తులు
శ్రీశైలంటెంపుల్: సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమాన్ని సోమవారం శ్రీశైల దేవస్థానంలో నిర్వహించారు. ఉదయం ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి ఆలంకార మండపంలో సహస్ర కలశారాధన చేశారు. భక్తులందరూ కలశాలను తలపై ధరించి ఆలయ ప్రాంగణం నుంచి గంగాధర మండపం, నందిగుడి, మల్లికార్జునసదన్ మీదుగా బయలు వీరభద్రస్వామి ఆలయానికి వెళ్లారు. అక్కడ స్వామికి విశేషపూజాదికాలను జరిపి వెయ్యి మంది భక్తులు ఆలయానికి వెళ్లి వృద్ధమల్లికార్జున స్వామివారికి కలశాభిషేకం చేశారు. కలశయాత్రలో పాల్గొన్న భక్తులందరికీ మల్లికార్జున స్వామివారికి అలంకార దర్శనం, అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం దేవస్థానం అందించిన పుస్తకాలు, పెన్నులతో శివపంచాక్షరీ నామ లేఖ యజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమంలో భాగంగానే గంగాధర మండపం వద్ద సాయంత్రం పలు ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు చేశారు. అనంతరం వనపర్తికి చెందిన సత్యంస్వామి, బృందం వారిచే శివభజనలు, రాజమహేంద్రవరానికి చెందిన తాతా సందీప్‌శర్మ వారిచే ఓంకారం ప్రాశస్త్యంపై ప్రవచనం నిర్వహించారు. విజయనగరానికి చెందిన సుప్రియ బృందం వారిచే పేరిణి శివతాండవం ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఈఓ ఎం.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సోమనాథ్ ఆలయంపై దాడి జరిగి వెయ్యి సంవత్సరాలు, ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 సంవత్సరాల సందర్భంగా భారత ప్రభుత సాంస్కృతిక శాఖ దేశవ్యాప్తంగా సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ పేరుతో పలు కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు.


