ఆళ్లగడ్డ: ప్రజలకు ఉచితంగా ఇసుక అందిస్తామని చెబుతూ ఆళ్లగడ్డలో టీడీపీ నేతలు నిల్వ కేంద్రాన్ని ఏర్పాటు చేసి అక్రమాలు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి భూమా కిషోర్‌రెడ్డి విమర్శించారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆళ్లగడ్డలో ఏర్పాటు చేసిన ఉచిత ఇసుక నిల్వ కేంద్రం నుంచి ప్రజలకు ఇసుమంత కూడా ఇవ్వలేదన్నారు. ఒక ధర నిర్ణయించి అమ్ముకుంటూ ప్రజలను దోచుకుంటున్నారని మండిపడ్డారు. రెండేళ్లుగా ఆళ్లగడ్డ మార్కెట్‌యార్డ్‌లో రైతులు నిల్వ చేసుకున్న ధాన్యాన్ని మద్దతు ధరతో ఒక్క గింజ కూడా కొనుగోలు చేయలేదన్నారు. తాను గెలిస్తే ఏడాదికి ఐదు వేల ఉద్యోగాలు ఇప్పిస్తానని ఎమ్మెల్యే అఖిలప్రియ హామీ ఇచ్చి రెండేళ్లుగా ఎంత మందికి ఉద్యోగాలు ఇప్పించారో చెప్పాలని నిలదీశారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు.
జూనియర్ సివిల్ జడ్జిల బదిలీ
కర్నూలు: జిల్లాలో జూనియర్ సివిల్ జడ్జి పోస్టులను భర్తీ చేస్తూ రాష్ట్ర హైకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కర్నూలు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న ఎం.సరోజినమ్మను ఖాళీగా ఉన్న రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు బదిలీ చేసి ఆమె స్థానంలో తిరుపతిలో పనిచేస్తున్న ఎం.సంధ్యారాణిని బదిలీ చేసింది. నూతనంగా మంజూరైన 5వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు గొల్లపూడి స్రవంతిని, గుంటూరు నుంచి బదిలీ చేసి నియమించారు. ఖాళీగా ఉన్న కోవెలకుంట్ల జూనియర్ సివిల్ జడ్జి పోస్టుకు అనంతపురంలో పనిచేస్తున్న జి.మంజులను బదిలీ చేసి నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా 62 మంది జూనియర్ సివిల్ జడ్జిలను రాష్ట్ర హైకోర్టు బదిలీ చేస్తూ విజిలెన్స్ రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన న్యాయాధికారులు ఈనెల 18వ తేదీ లోగా వారి స్థానాల్లో చేరాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.


