అకాల వర్షం .. రైతులకు నష్టం! | - | Sakshi
Sakshi News home page

అకాల వర్షం .. రైతులకు నష్టం!

May 12 2026 5:42 AM | Updated on May 12 2026 5:42 AM

బనగానపల్లె రూరల్‌/కొలిమిగుండ్ల/వెల్దుర్తి: మండు వేసవిలో అకాల వర్షాలు రైతులను భయపెడుతున్నాయి. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా.. సాయంత్రం 6 గంటల సమయంలో బనగానపల్లె, చుట్టు పక్కల ప్రాంతాల్లో దాదాపు 20 నిమిషాలు మోస్తరు వర్షం కురిసింది. గాలీవానకు వరి పైర్లు నేలవాలాయి. ఆరబోసిన వరి, మొక్కజొన్న ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు పట్టలు కప్పారు. అవుకు ప్రాంతంలో వరి పంట కాలం పూర్తి కావడంతో చాలా మంది రైతులు కోత కోసేందుకు సిద్ధపడుతున్నారు. ఈ తరుణంలో ఈదురు గాలులు, వర్షంతో రైతులు నష్టపోయారు. వెల్దుర్తి మండలంలో ఆదివారం రాత్రి గాలీవాన భీభత్సం సృష్టించింది. మండల కేంద్రంలో ఈదురుగాలులతో పట్టణానికి తాగునీరందించే పథకం రామళ్లకోట రోడ్డులోని పార్వతయ్య బావి వద్ద ఉన్న సంప్‌పై భారీ చెట్టు కొమ్మలు విరిగి పడ్డాయి. ఫలితంగా సంప్‌ నుంచి పట్టణానికి సరఫరా చేసే పైప్‌లైన్‌లు, మోటార్లు దెబ్బతిన్నాయి. విద్యుత్‌ లైన్లు తెగిపోయాయి. పంచాయతీ సెక్రటరీ లక్ష్మీనాథ్‌, విద్యుత్‌ ఏఈఈ వెంకటేశ్వర్లు యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టి తాగునీటి సరఫరాను సోమవారం సాయంత్రానికి పునరుద్ధరించారు. రామళ్లకోట రోడ్డులోని పెట్రోల్‌ బంక్‌ వద్ద, మరోచోట రెండు విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి. విద్యుత్‌ అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టారు. ఈదురుగాలులకు గోవర్ధనగిరి, శ్రీరంగాపురం, ఎల్‌ నగరం, లక్షుంపల్లె, చెర్లకొత్తూరు, బోగోలు, తదితర ప్రాంతాల మామిడి తోటల్లో కాయలు రాలిపోయాయి రైతులు నష్టపోయారు.

Advertisement
 
Advertisement
Advertisement