శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులను పురస్కరించుకుని వేలాది మంది భక్తులు తరలిరావడంతో క్షేత్రంలో వేసవి రద్దీ నెలకొంది. ఆదివారం సెలవు రోజును పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం వేలాది మంది భక్తులు తరలివచ్చారు. వేకువజామున పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి ఆలయ క్యూలైన్ల వద్ద బారులుదీరారు. భక్తుల రద్దీతో ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్లు నిండిపోయాయి. భక్తుల శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. క్షేత్ర పురవీధుల్లో భక్తుల సౌకర్యార్థం దేవస్థానం చలివేంద్రాలను ఏర్పాటు చేసి మజ్జిగ, మంచినీటిని అందిస్తున్నారు.


