నేడు కలెక్టరేట్‌లో ప్రజా వినతుల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

నేడు కలెక్టరేట్‌లో ప్రజా వినతుల స్వీకరణ

May 12 2026 5:36 AM | Updated on May 12 2026 5:36 AM

నంద్యాల: స్థానిక కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాలులో ఈనెల 11వ తేదీ సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడం కోసం టోల్‌ ఫ్రీ నంబర్‌ 1100ను సంప్రదించవచ్చన్నారు. అలాగే అర్జీదారులు దరఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను కూడా ఇలాగే నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో, మున్సిపల్‌ కార్యాలయాల్లో, డివిజన్‌ స్థాయిలో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.

తెలుగు బాషా ప్రాముఖ్యతను వివరించండి

నంద్యాల(వ్యవసాయం): తెలుగు బాషా ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించాలని 2026 ఉగాది పురస్కార గ్రహీత డాక్టర్‌ వైష్ణవ వెంకటరమణమూర్తి అన్నారు. విద్యార్థులలో తెలుగుపై మక్కువ పెంచడం ఎల్ఙా అనే అంశంపై ఆదివారం ఓ ప్రైవేటు కళాశాలలో చర్చా గోష్టి నిర్వహించారు. పట్టణానికి చెందిన ప్రముఖ ఉపాధ్యాయులు, తెలుగు రచయితలు ఈ కార్యక్రమంలో పాల్గొని సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యాలయాల్లో తెలుగు వాతావరణాన్ని సృష్టించాలన్నారు. ముఖ్యంగా సంస్కృతి, సంప్రదాయాలను వివరించాలన్నారు. సోషల్‌ మీడియాలో తెలుగుకు ప్రాధాన్యం ఉండాలని, వక్తృత్వ పోటీలు, వ్యాసరచన పోటీలు విద్యార్థులకు నిర్వహించాలని, విద్యాలయాల్లో తెలుగు పుస్తకాలతో కూడిన గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలని అభిప్రాయపడ్డారు. విద్యాసంస్థల్లో ప్రతినెల సాహితీ సంబంధ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో తెలుగు ఉపాధ్యాయులు అన్నెం శ్రీనివాసరెడ్డి, డాక్టర్‌ నీలం వెంకటేశ్వర్లు, రచయి మాబు బాషా, అధ్యాపకులు కొప్పుల ప్రసాదు, మురళీధరరెడ్డి, ప్రసాద్‌, మహామ్మద్‌ రఫి తదితరులు పాల్గొన్నారు.

మీరాపురం వాసి ఐఎఫ్‌ఎస్‌కు ఎంపిక

బనగానపల్లె రూరల్‌: మీరాపురం గ్రామానికి చెందిన బండి ఉమామహేశ్వరరెడ్డి, వందన దంపతుల కుమారుడు బండి జయఅశ్వర్థరెడ్డి ఇండియన్‌ ఫారెస్టు సర్వీస్‌ (ఐఎఫ్‌ఎస్‌)లో ఉద్యోగం సాధించినట్లు కుటుంబ సభ్యులు ఆదివారం తెలిపారు. తండ్రి ఉమామహేశ్వరరెడ్డి ప్రస్తుతం విజయవాడలో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. జయఅశ్వర్థరెడ్డి విద్యాభ్యాసం బనగానపల్లె, కర్నూలులో, ఇంటర్‌, బీటెక్‌ (సివిల్‌ ఇంజనీరింగ్‌) హైదరాబాద్‌లో పూర్తి చేశారన్నారు. అనంతరం సివిల్స్‌కు ప్రిపేర్‌ అవుతూ గత సంవత్సరం జరిగిన యూపీఎస్‌సీ పరీక్ష రాశారు. ఇటీవల ఫలితాలు విడుదల కాగా జయఅశ్వర్థరెడ్డి ఇండియన్‌ ఫారెస్టు సర్వీస్‌కు ఎంపికై నట్లు కుటుంబీకులు తెలిపారు.

వేరుశనగ క్వింటా రూ.7,200

ఎమ్మిగనూరుటౌన్‌: స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో ఆదివారం క్వింటా వేరుశనగ గరిష్టంగా రూ.7,200 ధర పలికింది. మార్కెట్‌కు 115 క్వింటాళ్ల వేరుశనగ దిగుబడులు మాత్రమే మార్కెట్‌కు విక్రయానికి వచ్చాయి. దీంతో క్వింటా వేరుశనగ కనిష్ట ధర రూ.5,540కు, మధ్యస్థ ధర క్వింటం రూ,6,713 ప్రకారం వ్యాపారులు కొనుగోలు చేసినట్లు మార్కెట్‌ యార్డ్‌ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి జి. చంద్రమౌళి తెలిపారు. అదేవిధంగా ఆముదాలు 42 క్వింటాళ్లు విక్రయానికి రావడంతో కనిష్ట ధర క్వింటా రూ.5,880లు. మధ్యస్థ రూ.5,890, గరిష్టంగా ధర రూ.5,901కు, కందులు 2 క్వింటాళ్లు అమ్మకానికి రావడంతో క్వింటా గరిష్ట ధర రూ.6,430కు వ్యాపారులు కొనుగోలు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement