పాణ్యంలో ఆరబెట్టిన మొక్కజొన్నలో నీటిని తోడుతున్న రైతులు
నెరవాడ మెట్ట వద్ద ధాన్యంపై పట్టలు కప్పడంతో నిలిచిన వర్షపునీరు
పాణ్యం: మద్దతు ధర లేక కల్లాల్లో ఆరబెట్టుకున్న ధాన్యం అకాల వర్షంతో నీటిపాలైంది. రైతుల ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది. పాణ్యం, నెరవాడ, బలపనూరు, కొండజూటూరు, భూపనపాడు, కొణిదేడు గ్రామాల్లో వర్షం ప్రభావంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. చేతికొచ్చిన మొక్కజొన్న, వరి ధాన్యాన్ని రోడ్లపై, కల్లాల్లో ఆరబోసుకోగా అకాల వర్షం కురియడంతో మొత్తం నీట తడిసి పోయింది. వర్షం తగ్గిన తర్వాత రైతులు వర్షపునీటిని తొలగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పాణ్యంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న సర్వీసు రోడ్లలో వర్షపునీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అలాగే నెరవాడ మెట్ట వద్ద సర్వీసు రోడ్లపై వరి, మొక్కజొన్న ధాన్యాన్ని ఆరబెట్టుకోగా దిగుబడులు మొత్తం నీట తడిసి పోయాయి.


