నందికొట్కూరు: ఆరోగ్యమాత కరుణ అందరిపై ఉందని ఉమ్మడి కర్నూలు జిల్లా ఆర్‌సీఎం చర్చి మేత్రాసన బిషప్ గోరంట్ల జ్వానేష్ అన్నారు. ఆదివారం పట్టణంలో వేలంగణి మాత మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలో ప్రధాన రహదారి, పురవీధుల వెంట మేరీమాత విగ్రహాన్ని మేళతాళాల మధ్య ఊరేగింపు నిర్వహించారు. రంగులు చల్లుకుంటూ అంగరంగ వైభవంగా మేరీమాత ఉత్సవాలను జరుపుకున్నారు. అనంతరం ఆర్‌సీఎం చర్చిలో భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. మేరీమాత వద్ద జ్యోతులు వెలిగించి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా బిషప్ మాట్లాడుతూ.. జిల్లా వాసులకు నాగపట్నం తరహాలో మేరీమాతను నందికొట్కూరులో ప్రతిష్టించడం విశేషమన్నారు. ఉత్సవాల్లో ఫాదర్ కేడీ జోసెఫ్, సహాయక ఫాదర్ బాల ఏసు తదితరులు ప్రార్థనలో పాల్గొన్నారు.


