ఆహారంలో సింథటిక్ కలర్స్ కలపొద్దు
వాటిని చూడగానే నోరూరిస్తున్నాయని ఆబగా తింటున్నారా...అయితే కాస్త ఆగండి. మీరు తినే రంగులు కలిపిన ఆహార పదార్థాలలో పరిమితికి మించి, నిషేధిత సింథటిక్ కలిపి ఉంటున్నాయి. దీనివల్ల ఇప్పటికిప్పుడు జీర్ణకోశవ్యాధులు, భవిష్యత్‌లో క్యాన్సర్ వంటి ప్రమాదకర జబ్బులు వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందంగా, ఆకర్షణీయంగా ఉన్నాయని ఏది పడితే అది తింటే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని వారు చెబుతున్నారు. లాభాపేక్ష కోసం వ్యాపారులు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నా అడ్డుకునే వారు కరువయ్యారు.
● ఆహార పదార్థాల్లో విచ్చలవిడిగా రంగుల వినియోగం
● నిషేధిత రంగులూ యథేచ్ఛగా వాడుతున్న వ్యాపారులు
● హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీల్లో అధికం
● జీర్ణకోశవ్యాధులు, క్యాన్సర్‌కు అవకాశం
● దాడులు చేస్తున్నా మారని వైనం
కర్నూలు(హాస్పిటల్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో హోటళ్లు, రెస్టారెంట్లు, రోడ్డుసైడ్ తోపుడు బండ్లు, టీ దుకాణాలు, మొబైల్ క్యాంటీన్లు, డాబాలు, చాట్‌బాండార్, నూడుల్స్ షాపులు అన్నీ కలుపుకుని దాదాపు 15 వేలకు పైగా ఉంటాయి. కర్నూలు నగరంలో మాత్రమే 4 వేల దాకా హోటల్స్, దుకాణాలు, రోడ్డుసైడు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఆయా వ్యాపారాల ద్వారా ప్రతి ఏడాది కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతోంది. కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతున్నా వీటిలో జీఎస్‌టి చెల్లించేది కేవలం 5 శాతంలోపు వ్యాపారులే ఉంటారన్నది బహిరంగ రహస్యం. ఉమ్మడి జిల్లాలోని స్వీట్స్ తయారీ కేంద్రాలు, విక్రయ కేంద్రాలతో పాటు హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ల, జంక్‌ఫుడ్ కేంద్రాలు, కూల్‌డ్రింక్స్ దుకాణాలలో పరిమితికి మించి ప్రాణాంతక బుష్‌పౌడర్ అనే సింథటిక్ కలర్ వాడుతున్నారు. నిబంధనల ప్రకారం ఒక కిలో ఆహార పదార్థానికి 0.001మి.గ్రా వాడాలి. అయితే వ్యాపారులు వారు విక్రయించే ఆహార పదార్థాలు ఆకర్షణీయంగా కనిపించాలన్న ఉద్దేశంతో కిలోకు 10 నుంచి 20 మి.గ్రా ఫుడ్‌కలర్ వాడుతున్నారు. ఇలా పరిమితికి మించి వాడితే ఆ పదార్థాలను తిన్న వారికి జీర్ణకోశవ్యాధులు, కాలేయ వ్యాధులు, కడుపులో అల్సర్, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా ఈ రంగులను ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో గోబీ మంచూరియా, కచోరి, కట్‌లెట్, రెస్టారెంట్లలో బిర్యానీలు, గ్రేవీ ఐటమ్స్, పలు రకాల ఫ్రై ఐటమ్స్, స్వీట్లు, చాక్లెట్లు, ఐస్‌క్రీమ్‌లు, కేక్‌లు, కూల్‌డ్రింక్‌లలో ఎక్కువగా వాడుతున్నారు.
లెక్కచేయని వ్యాపారులు
ఆహార భద్రత అధికారులు ఇటీవల కాలంలో కల్తీ పదార్థాలు, నిషేధిత రంగులు కలిపిన పదార్థాలను విక్రయించే వారిపై విస్తృతంగా దాడులు నిర్వహించి జరిమానాలు విధిస్తున్నారు. అయినా వ్యాపారుల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. యథేచ్ఛగా వారు ఆహార పదార్థాల్లో నిషేధిత సింథటిక్ రంగులు కలిపి విక్రయిస్తున్నారు. అధికారులు ఎవ్వరైనా దాడులు చేస్తే వెంటనే వ్యాపారులు వారికి పరిచయం ఉన్న వారితో ప్రజాప్రతినిధులతో అధికారులకు ఫోన్ చేయించి ‘మా వాడే వదిలేయండి’ అని చెప్పిస్తున్నారు. నూటికి 70 శాతం మంది ఇలాగే చేస్తుండగా అధికారులు తలపట్టుకుంటున్నారు. గత నాలుగేళ్లుగా జిల్లాలోని పలువురు వ్యాపారులస్తులపై దాడులు నిర్వహించి నిబంధనలు పాటించని వ్యాపారులకు భారీగా జరిమానాలు విధించారు. అయినా కూడా ఇతర వ్యాపారుల్లో ఎలాంటి మార్పు కనిపించకపోవడం ప్రజారోగ్యం పట్ల వారికున్న చిత్తశుద్ధి ఎలాంటిదో అర్థం అవుతుంది.
రంగులు కలిపిన బెల్లం
రంగులు కలిపిన
బఠానీలు
రంగులు కలిపిన
కివీ డ్రై ఫ్రూట్
ఆహార పదార్థాల్లో సింథటిక్ కలర్స్ వాడకూడదు. ముఖ్యంగా వీటిని గోబీమంచూరియా, చికెన్ దమ్ బిర్యానీ, రెస్టారెంట్లలో ఫ్రైలు, గ్రేవీ ఐటమ్స్‌లో ఎక్కువగా కలుపుతున్నారు. అలాగే స్వీట్లలో, కూల్‌డ్రింక్స్‌లోనూ పరిమితికి మించి రంగులు కలుపుతున్నారు. ఈ మేరకు వ్యాపారులను హెచ్చరించి నోటీసులు జారీ భారీగా జరిమానాలు కూడా విధిస్తున్నాం. ఆహార పదార్థాల తయారీలో నిబంధనలు పాటించని వ్యాపారుల పట్ల కఠినంగా ఉంటున్నాం.
– కూర్మా నాయకులు, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్, ఉమ్మడి కర్నూలు జిల్లా


