రుద్రవరం: ముస్లింలు అల్లా మార్గంలో నడవాలని మత పెద్దలు అన్నారు. రుద్రవరంలో ఆదివారం ఇస్తెమా నిర్వహించారు. తెల్లవారు జాము నుంచి రాత్రి వరకు ఐదు మార్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మత పెద్దలు మాట్లాడుతూ.. ప్రతి రోజు నమాజ్ చేయాలని, అలాగే సంపాదనలో జకాత్ తీసి పేదలకు పంచాలని చెప్పారు. శాంతి మార్గంలో నడుస్తూ అందరితో మంచిగా మెలగాలని వివరించారు. ఇస్తెమాకు వచ్చిన వారికి స్థానిక ముస్లింలు తగిన వసతులు కల్పించారు. ఎండలు అధికంగా ఉండటంతో దాతల సహాయంతో మజ్జిగ, వాటర్ ప్యాకెట్లు, పండ్లు పంపిణీ చేశారు.
గడ్డి వాము, ట్రాక్టర్ దగ్ధం
బేతంచెర్ల: అంబాపురం గ్రామంలో గడ్డివాము, ట్రాక్టర్ దగ్ధమైన సంఘటన ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. వివరాల మేరకు గ్రామానికి దగడ సురేంద్రనాథ్ రెడ్డి గడ్డివాముకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. గమనించిన గ్రామస్తులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా అదుపులోకి రాకపోగా , పక్కన్న ఉన్న ట్రాక్టర్ ఇంజన్‌కు సైతం మంటలు వ్యాపించి దగ్ధమైంది. సుమారు గడ్డివాము, ట్రాక్టర్ దగ్ధమై రూ.6.50 లక్షల ఆస్తి నష్టం వాటిలినట్లు బాధితుడు తెలిపారు. గ్రామంలో గడ్డివాము దగ్ధం సంఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధిత రైతుకు న్యాయం చేయాలని గ్రామ సీపీఐ నాయకులు శ్రీరాములు, సోమన్న, నాగేశ్వరరావు, చంద్రమోహన్ డిమాండు చేశారు.
రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
కర్నూలు (టౌన్): కర్నూలు – గుంటూరు రహదారిలో నందనపల్లి గ్రామ శివారులో ఉన్న శ్రీనివాస గార్డెన్ సమీపంలో ఆదివారం వాహనం ఢీకొని గుర్తుతెలియని ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికంగా కుంభకోణం కాఫీ హోటల్ దగ్గరలో గార్గేయపురం వైపు నుంచి కర్నూలుకు వస్తున్న కంకర మిక్చర్ వాహనం రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిని ఢీకొంది. ఈ ఘటనలో తీవ్ర గాయాలుకావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న స్థానిక వీఆర్‌ఓ ఖాజామియ్య కర్నూలు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకొని మృతుడి ఆనవాళ్లు సేకరించారు. సుమారు 45 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు ఉండి 5.6 అడుగుల ఎత్తు, చామనఛాయ రంగు కలిగి ఉన్నాడు. వివరాలు తెలిస్తే 91211 01063 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.
ఘాట్ రోడ్డులో
లారీ బోల్తా
● ప్రాణభయంతో కిందకు దూకి
మృతి చెందిన క్లీనర్
మహానంది: నంద్యాల – గిద్దలూరు నల్లమల ఘాట్‌రోడ్డులో అదుపు తప్పిన లారీ కొండచరియను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో క్లీనర్ మృతి చెందాడు. ఒంగోలు నుంచి బళ్లారికి ఐరన్ షీట్లతో వెళ్తున్న లారీ పాత బొగద దొరబావి వంతెన మలుపు సమీపంలో బ్రేకులు ఫెయిల్ కావడంతో కొండ చరియను ఢీకొని బోల్తా పడింది. దీంతో లారీలో డ్రైవర్‌తో పాటు ఉన్న క్లీనర్ ప్రసాద్ ప్రాణభయంతో కిందికి దూకడంతో తలకు దెబ్బలు తగిలి మృతి చెందాడు. లారీ వెనుకే వస్తున్న ఓ స్కార్పియో వాహన దారులు అప్రమత్తమై వెనుకకు వెళ్తుండగా లారీ వెనుక భాగం నుంచి ఐరన్ షీట్లు పడటంతో వాహనం ముందు భాగం దెబ్బతినింది. సుమారు మూడు గంటలకు పైగా వాహ నాల రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న రోడ్‌సేఫ్టీ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించి రోడ్డుపై బోల్తాపడిన లారీని జేసీబీ సహాయంతో పక్కకు తప్పించడంతో వాహనాల రాకపోకలు యథావిధిగా కొనసాగాయి. క్లీనర్ ప్రసాద్ విజయవాడ నగరానికి చెందిన వ్యక్తిగా పోలీసులు తెలిపారు. నంద్యాల ఏఎస్పీ మందా జావళి, మహానంది ఎస్‌ఐ రామ్మోహన్‌రెడ్డి ప్రమాద స్థలాన్ని పరిశీలించారు.


