● ఉపాధి హామీ పనుల్లో బోగస్ మస్టర్లు
కొలిమిగుండ్ల: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో బోగస్ కూలీలకే ఎక్కువగా లబ్ధి జరుగుతోంది. ఇందుకు టీడీపీ నాయకులు సహకారం అందిస్తున్నారు. అన్ని గ్రామాల్లో ఫీల్డ్ అసిస్టెంట్‌లను తమ అనుమాయులనే నియమించుకున్నారు. బనగానపల్లె నియోజకవర్గంలో 44,677 జాబ్ కార్డులు ఉండగా 60,664 మంది కూలీలు పనులకు హాజరవుతున్నారు. పనులకు వెళ్లకుండా చాలా మంది జాబ్ కార్డులు పొందారు. వీరికి హాజరు వేస్తుండటంతో పనులు చేసే కూలీలకు అన్యాయం జరుగుతోంది.
ఒకరి పేరిట అందరికీ హాజరు
పనులు జరుగుతున్న ప్రదేశాల్లో ప్రతి కూలీ ముఖాన్ని ఆన్‌లైన్‌లో యాప్ ద్వారా ఎఫ్‌ఎర్‌ఎస్(ఫేస్ రిగ్నైజేషన్ సిస్టం)లో నమోదు చేయాలి. ఫీల్డ్ అసిస్టెంట్ ఎక్కడి నుంచి ట్యాగ్ చేశారో అక్కడ మాత్రమే ఎఫ్‌ఆర్‌ఎస్ అవుతుంది. చాలా గ్రామాల్లో ఫీల్డ్ అసిస్టెంట్‌లు ఒకరి ముఖాన్ని ఆన్‌లైన్ చేసి మిగిలిన వారికి హాజరు నమోదు చేస్తున్నారు. దీంతో పదుల సంఖ్యలో బోగస్ కూలీలకు లబ్ధి జరుగుతోంది. ఇతర పనులు చేసేకునే వాళ్లతో పాటు ఫీల్డ్ అసిస్టెంట్ కుటుంబాల్లోని ముగ్గురు, నలుగురికి మస్టర్లలో హాజరు వేసి వేతనాలు పొందుతున్నారు.
ఒప్పందం కుదుర్చుకుని
ఇంటి నుంచి బయట పనులకు వెళ్లని చాలా మంది మహిళలను ఉపాధి కూలీలుగా మార్చారు. పలు గ్రామాల్లో తెల్లవారు జామునే వారిని పని ప్రదేశం సమీపం వరకు తీసుకెళ్లి ఫేస్‌యాప్ తీసుకొని హాజరు వేసి ఇళ్లకు పంపిస్తున్నారు. మరి కొన్ని చోట్ల ఉపాధి సిబ్బంది ఫీల్డ్ అసిస్టెంట్లకు నెలకు రూ.15 వేలు ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఏడాదికి ఒక సారి సోషల్ ఆడిట్ నిర్వహిస్తూ.. కూలీలు, పని ప్రదేశాలను తనిఖీ చేస్తారు. ఈలోగా ఫీల్డ్ అసిస్టెంట్‌లు, ఉపాధి సిబ్బంది ఆడిట్ సిబ్బందికి మాయమాటలు చెప్పి తప్పుదోవ పట్టిస్తున్నారు. సామాజిక తనిఖీ బహిరంగ సభలో సైతం నివేదికలు చదివి వినిపించి చిన్న తప్పులు మాత్రమే జరిగాయి రికవరీ చేయండి అని అధికారులు ఆదేశాలిచ్చి చేతులు దులుపుకుంటున్నారు.
పనులకు వెళ్లకుండా హాజరు వేస్తున్నారనే వాటిపై దృష్టి సారిస్తాం. ఫేస్ యాప్ వచ్చాక తప్పకుండా పని ప్రదేశంలో పోటో ఆప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ యాప్ వచ్చాక చాలా వరకు బోగస్ తగ్గింది. తనిఖీలు నిర్వహించి అరికట్టేందుకు చర్యలు తీసుకుంటాం. – సాంబశివరావు, ఏపీడీ


