బొమ్మలసత్రం: గుంటూరు నుంచి తిరుపతికి వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు ఇకపై తిరుచ్చిరాపల్లి నడవనుంది. ఈ మేరకు రైల్వే ఉన్నతాధికారులు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. గుంటూరు నుంచి నంద్యాల, బనగానపల్లె, కోవెలకుంట్ల మీదుగా తిరుపతికి వెల్లే ఎక్స్‌ప్రెస్ నెంబర్ 17261/17262 రైలు రైల్వే శాఖా మంత్రి అశ్విని వైష్ణవ్ గారి సూచనల మేరకూ తిరుచ్చినాపల్లి వరకూ పొడిగిస్తున్నామని ప్రకటనలో పేర్కొన్నారు. ఇకపై అరుణాచలం వెళ్లే భక్తులకు ఈరైలు సదుపాయంగా ఉంటుందని వివరించారు.
అంతర్జాతీయ గౌరవం అభినందనీయం
మంత్రాలయం: హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రాఘవేంద్రకు అంతర్జాతీయ స్థాయి గౌరవం దక్కడం అభినందనీయం అని శ్రీరాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు అన్నారు. హైదరాబాద్ ఎస్‌ఆర్‌ఎస్ పెయిన్ క్లినిక్ వ్యవస్థాపాకుడు ఎం.పీ.టీ. న్యూరో డ్రై నీడ్లింగ్ స్పెషలిస్ట్ అయిన డాక్టర్ రాఘవేంద్రకు బుక్‌ఆఫ్‌వరల్డ్‌ను పీఠాధిపతి శనివారం అందజేశారు. ఈ సందర్భంగా పీఠాధిపతి మాట్లాడుతూ.. పెయిన్ మేనేజ్‌మెంట్, ఫిజియోథెరఫీ రంగంలో విశేషసేవలకు గుర్తింపుగా అవార్డు రావడం విశేషం అన్నారు. ఈ అవార్డు డాక్టర్‌కు మరింత బాధ్యతను పెంచుతుందన్నారు.
మిడ్ కెరీర్ ట్రైనింగ్‌కు కర్నూలు డీఎఫ్‌ఓ
కర్నూలు కల్చరల్: ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఆఫీసర్స్‌కు నిర్వహించే మిడ్ కెరీర్ ట్రైనింగ్‌కు కర్నూలు జిల్లా అటవీ శాఖ అధికారి పి.శ్యామల వెళ్లనున్నారు. ఈనెల 11 నుంచి జూన్ 5వ తేదీ వరకు డెహ్రాడూన్ ఐజీఎన్‌ఎఫ్‌ఏలో నిర్వహించే శిక్షణలో ఆమె పాల్గొననున్నారు. మేనేజ్‌మెంట్ మాడ్యూల్, థెమాటిక్ టూర్, లైన్ మినిస్ట్రీ మాడ్యుల్, ఫారెస్ట్రీ మాడ్యుల్‌లో నాలుగు వారాల శిక్షణలో పాల్గొంటారు. ఈమె ట్రైనింగ్‌కు వెళ్లనుండటంతో నంద్యాల డీఎఫ్‌వో నాగమునేశ్వరికి కర్నూలు ఇన్‌ఛార్జి డీఎఫ్‌వో బాధ్యతలు అప్పగించారు.
12 నుంచి గుంతకల్లు–
మార్కాపురం రైలు
● డోన్, నంద్యాల మీదుగా పయనం
మద్దికెర: గుంతకల్లు నుంచి మార్కాపురం మధ్య ప్రతిరోజు ప్రయాణించే రైలును ఈనెల 12వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు గుంతకల్లు రైల్వే డివిజన్ అధికారులు శనివారం తెలిపారు. 57407 నంబర్ రైలు గుంతకల్లు నుంచి సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరి 5.33 గంటలకు మద్దికెరకు చేరుకుంటుందన్నారు. 6.18 గంటలకు పెండేకల్లు, 6:43 గంటలకు డోన్, నంద్యాల మీదుగా రాత్రి 11.30 గంటలకు మార్కాపురం రోడ్ స్టేషన్‌కు చేరుకుంటుందన్నారు. అలాగే 57408 నంబర్ రైలు ఉదయం 4.30 గంటలకు మార్కాపురం రోడ్‌లో బయలుదేరి నంద్యాల మీదుగా డోన్‌కు 8.45కు, పెండేకల్లుకు 9.10, మద్దికెరకు 9.35, గుంతకల్లుకు 10.30కు చేరుకుంటుందన్నారు. ఈనెల 12న ప్రారంభయ్యే రైలు గుంతకల్లులో మధ్యాహ్నం 1:23కు బయలుదేరుతుందన్నారు.


