● జీతాలు ఇస్తేనే పనిచేస్తామని ఆందోళన
● మొదలు కాని పోస్టుమార్టం ప్రక్రియ
● మృతుల కుటుంబీకుల ఆందోళన
● ఫోరెనిక్స్ హెచ్‌ఓడీకి మెమో జారీ
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని మార్చురీ వద్ద శనివారం ఉద్రిక్తత నెలకొంది. మార్చురీలో పనిచేసే వర్కర్లు తాళం తీయకపోవడంతో ఉదయం 10.30 గంటలు దాటినా పోస్టుమార్టంకు సంబంధించి ప్రక్రియ మొదలు కాలేదు. తాళం తీయడానికి వర్కర్లు ఎవ్వరూ రాకపోవడం, తమకు జీతాలు ఇస్తేనే పనిచేస్తామని వారు భీష్మించడంతో ఆందోళన పరిస్థితి తలెత్తింది. దీంతో మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు మూకుమ్మడిగా ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్‌లో హెచ్‌ఓడీని కలిసేందుకు వెళ్లారు. ఆయన ఎగ్జామినర్ డ్యూటీలో ఉండటంతో కళాశాల ప్రిన్సిపాల్‌ను కలిసేందుకు వెళ్లారు. ఆమె కూడా జూమ్ మీటింగ్‌లో ఉండటంతో విధిలేక నినాదాలు చేశారు. దీంతో ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ ఫోరెన్సిక్ విభాగం వైద్యులను పిలిపించి మృతులకు పోస్టుమార్టం నిర్వహించే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఆ మేరకు వైద్యులు వెళ్లి సెక్యూరిటీ సిబ్బంది సహాయంతో మార్చురీ గదిని తెరిచారు. కొద్దిసేపటికి ఇద్దరు వర్కర్లు రావడంతో పోస్టుమార్టం ప్రక్రియ మొదలైంది. మార్చురీ సిబ్బంది మృతుల కుటుంబీకుల నుంచి డబ్బు వసూలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డబ్బు తీసుకున్న వ్యక్తి, మరొకరు విధులకు గైర్హాజరు కాగా.. మరో ఇద్దరితో పోస్టుమార్టం ప్రక్రియ మొదలైంది. కాగా మార్చురీలో రాబందులు శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై వివరణ ఇవ్వాలంటూ ఫోరెన్సిక్ హెచ్‌ఓడీ డాక్టర్ బ్రహ్మాజీ మాస్టర్‌కు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు మెమో జారీ చేశారు.


