● జుర్రేరు వాగు సమీపంలో
అడ్డుకున్న రైతులు
కోవెలకుంట్ల: కోవెలకుంట్ల మండలం బిజనవేముల– అమడాల గ్రామాల మధ్య జుర్రేరు వాగు సమీపంలో శనివారం ఇసుక అక్రమ తరలింపును రైతులు అడ్డుకున్నారు. బిజనవేములకు చెందిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓ నాయకుడు బాడుగకు ప్రొక్లెయిన్ ఏర్పాటు చేసుకుని ఏడు ట్రాక్టర్ల ద్వారా ఇసుక అక్రమ తవ్వకాలు చేపట్టాడు. ఒక్కో ట్రిప్పు ఇసుకను రూ. 700 ప్రకారం విక్రయాలు జరుపుతుండగా ఆయా గ్రామాలకు చెందిన రైతులు విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్నారు. మైనింగ్, రెవెన్యూ శాఖ అధికారుల అనుమతి లేకుండా బంజరు భూమిలో ఇసుక తవ్వవాలు ఎలా చేస్తావంటూ ప్రశ్నించారు. ఇసుకను తరలించుకపోతే పక్క రైతుల భూమి కోతకు గురై వ్యవసాయానికి పనికి రాకుండా పోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక అక్రమ తవ్వక పనులను అడ్డుకుని పోలీస్, రెవెన్యూ అధికారులకు సమాచారం చేరవేయడంతో సదరు నాయకుడు పనులను ఆపి అక్కడి నుంచి ట్రాక్టర్లు, ప్రొక్లెయిన్‌ను తీసుకెళ్లడంతో సమస్య సద్దుమణిగింది.


