● దొంగను అరెస్ట్ చేసిన పోలీసులు
ఆళ్లగడ్డ: బెట్టింగ్‌లో అప్పు చేసి వాటిని తీర్చడానికి ఒక యువకుడు చోరీ చేసి పోలీసులకు పట్టుబడ్డాడు. ఆళ్లగడ్డ డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపిన వివరాల మేరకు.. దొర్నిపాడు మండలం కొండాపురం గ్రామానికి చెందిన జగన్మోహన్‌రెడ్డి రాజమండ్రిలో ఉంటూ బెట్టింగ్‌లో అప్పులు చేశాడు. అప్పులు ఎలా తీర్చాలో అర్థంకాక తన గ్రామంలో పక్కింట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలు చవ్వరామలక్ష్మమ్మ బంగారు ఆభరణాలు అపహరించడానికి పక్క ప్రణాళిక వేసుకున్నాడు. రామలక్షమ్మ ఇంట్లో ఏప్రిల్ 29న ఒంటిరిగా ఉందని గమనించాడు. తలకు హెల్మెట్ ధరించి, చేతులకు గ్లౌవ్స్ వేసుకుని మోటార్‌సైకిల్‌పై ఇంటి ముందుకు వచ్చా డు. తాను మట్టి పరీక్షలు చేసెందుకు వచ్చిన వ్యక్తిగా పరిచయం చేసుకున్నాడు. మట్టి పరీక్షలు చేయాలంటే కొంచెం ఐసు ముక్కలు అవసరమని అడగడటంతో వృద్ధురాలు ఇంట్లోకి వెళ్లారు. వెనుకే ఇంట్లోకి వెళ్లిన జగన్మోహన్‌రెడ్డి వృద్ధురాలి మెడలో ఉన్న బంగారు చైన్‌ను లాక్కొని అక్కడి నుంచి పరారయ్యాడు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి చైను దొంగతనం చేశారని కేసు నమోదు చేసుకున్న దొర్నిపాడు పోలీసులు పూర్తి విచారణ జరిపారు. పక్కింటి యువకుడే అని తేలడంతో శనివారం అదుపులోకి అతని దగ్గర నుంచి బంగారు చైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.


