పేదల బియ్యాన్ని కారు చౌకగా డీలర్లు కొట్టేస్తే, వారి వద్ద నుంచి తీసుకోవడానికి కూటమి నేతలు మాఫియా అవతారం ఎత్తుతున్నారు. నియోజకవర్గాల వారీగా ఆయా ప్రజాప్రతినిధుల అండతో అక్రమ బియ్యం వ్యాపారం చేసి కోట్లు సంపాదిస్తున్నారు. ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి 16వ తేదీ వరకు రేషన్ షాపుల్లో పేదలకు బియ్యం వేస్తుండగా.. 5నుంచి 20వ తేదీ వరకు వినియోగదారుల నుంచి సేకరించిన బియ్యాన్ని అధికారుల అండతో మాఫియా నేతలు జిల్లా సరిహద్దులు దాటిస్తున్నారు. అయితే బియ్యం అక్రమ దందాలో కొందరు అధికారులకు కూడా వాటాలు ఉంటుండడంతో కిమ్మనడం లేదని తెలుస్తోంది. ఈవిధంగా ప్రతి నెలా జిల్లాలో దాదాపు రూ.50–60 కోట్ల వ్యాపారం జరుగుతోంది.


