పాములపాడు: అయోధ్యలో బాలరాముని దర్శనార్థమై శుక్రవారం పాములపాడు నుంచి 320 మంది భక్తులు బయల్దేరారు. వారందరినీ వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు నాగరాజు దాదాపు రూ. 15 లక్షల సొంత ఖర్చులతో తీసుకెళ్లారు. నాలుగు నెలల క్రితం గ్రామంలో నిర్వహించిన హిందూ సమ్మేళన కార్యక్రమంలో ఇచ్చిన హామీని నెరవేర్చారు. అయోధ్యకు ఎంత మంది వచ్చినా సొంత ఖర్చులతో బాల రాముని దర్శన భాగ్యం కల్పిస్తామని మాట ఇచ్చారు. ఈ మేరకు టికెట్లు బుక్ చేయించారు. అయోధ్యతో పాటు కాశీకి కూడా వెళితే బాగుంటుందని కొందరు అడుగగా సరే అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 320 మంది భక్తులతో శుక్రవారం తెల్లవారుజామున ప్రైవేటు బస్సులో కర్నూలుకు బయలుదేరారు. అక్కడి నుంచి రైలులో వెళ్లనున్నారు. ఐదు రోజుల పర్యటనలో భాగంగా ఒక రోజు అయోధ్య, మరో రోజు కాశీలో దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణమవుతారు.


