‘చౌక’గా నొక్కేస్తున్నారు! | - | Sakshi
Sakshi News home page

‘చౌక’గా నొక్కేస్తున్నారు!

May 9 2026 9:31 AM | Updated on May 9 2026 9:31 AM

5వ తేదీ దాటితే బియ్యం లేవంటున్న డీలర్లు సరుకులకు సరిపడా డబ్బులు ఇస్తామని ప్రతిపాదన కారుచౌకగా కేజీ రూ.10 చొప్పున కొనుగోలు బ్లాక్‌ మార్కెట్‌లో రూ.19లకు విక్రయం కొందరు అధికారులకు నెల మామూళ్లు స్థానిక నాయకుల అండతో ‘చౌక’ దందా

బియ్యం వేయకుంటే చర్యలు

కర్నూలు(సెంట్రల్‌): టీడీపీ ప్రభుత్వంలో రేషన్‌ డీలర్ల ఇష్టారాజ్యం కొనసాగుతోంది. బియ్యం కావాలంటే 5వ తేదీలోపు రావాలని, లేదంటే ఇచ్చినంత డబ్బు తీసుకోవాలని బెదిరింపులకు పాల్పడుతున్నారు. నేరుగా డీలర్లే వినియోగదారుల నుంచి బియ్యం కొనుగోలు చేసి బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తున్నారు. కారుచౌకగా కేజీ బియ్యం రూ.10లకు కొనుగోలు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. 5వ తేదీ తర్వాత వెళితే బియ్యం లేవని మొండికేస్తుండటంతో, కార్డుదారులు డీలర్లు ఇచ్చిన అరకొర డబ్బుతో సరిపెట్టుకుంటున్నారు. కర్నూలు జిల్లాలో 1,233 రేషన్‌ దుకాణాలు ఉండగా.. వీటి పరిధిలో 6,34,631 కార్డుదారులు ఉన్నారు. అయితే డీలర్లు అక్రమాలకు మరిగి ప్రతి నెలా 5వ తేదీ వరకు మాత్రమే కొందరికి సరుకులను పంపిణీ చేస్తున్నారు. ఆ తరువాత షాపులకు వచ్చిన వారికి షాక్‌ ఇస్తున్నారు. బియ్యం లేవని.. కావాలంటే డబ్బులు ఇస్తామంటున్నారు. కచ్చితంగా బియ్యం కావాలంటే మరో షాపు చూసుకోవాలని ఉచిత సలహా ఇస్తున్నారు. అక్కడా ఇదే పరిస్థితి ఉండటంతో, తిరి గొచ్చి డీలరు ఇచ్చిన డబ్బుతో ఇంటిముఖం ప డుతున్నారు. ఇకపోతే 5వ తేదీలోపు చాలా వరకు దు కాణాలు మూతవేసి కనిపిస్తుండటం గమనార్హం.

చౌక దోపిడీ

ప్రభుత్వం సరఫరా చేసే బియ్యాన్ని అమ్మడం, కొనడం చేయరాదు. అయితే ప్రజలకు అందించాల్సిన రేషన్‌ సరుకులను డీలర్లే కాజేస్తున్నారు. కారు చౌకగా కేజీ బియ్యం రూ.10తో వినియోగదారుల నుంచి బయోమెట్రిక్‌ తీసుకొని నొక్కేస్తున్నారు. వీరు దానిపై రూ.9 వరకు లాభం పెట్టుకొని సమీపంలోని వ్యాపారులకు రూ.19 ప్రకారం అమ్ముతున్నారు. వారు దానిపై రూ.5 అదనంగా లాభం వేసుకొని రూ.24లకు విక్రయిస్తున్నారు. అక్కడి నుంచి మరో రూ.10 లాభంతో జిల్లా సరిహద్దులు దాటిస్తున్నారు. అంటే జిల్లా సరిహద్దులు దాటేలోపు బియ్యం ధర రూ.34లకు చేరుకుంటోంది.

రేషన్‌ బియ్యం డీలర్లపాలు!

కచ్చితంగా ఒకటో తేదీ నుంచి 16వ తేదీ వరకు రేషన్‌ షాపుల్లో బియ్యం వేయాల్సిందే. ప్రతి రోజూ ఉదయం 6 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు డీలర్లు ప్రజలకు అందుబాటులో ఉండి రేషన్‌ సరుకులను పంపిణీ చేయాలి. సరుకులకు బదులు డబ్బు ఇస్తామని డీలర్లు చెబితే 1967కు నంబర్‌కు కాల్‌ చేసి ఫిర్యాదు చేయండి. లేదంటే నేరుగా వచ్చి మాకు ఫిర్యాదు చేసినా సంబంధిత డీలర్లపై చర్యలు తీసుకుంటాం. – ఎం.రాజారఘువీర్‌, డీఎస్‌ఓ, కర్నూలు

Advertisement
 
Advertisement
Advertisement