ఆదోని అర్బన్: కేదార్‌నాథ్ క్షేత్ర దర్శనానికి వెళ్లిన ఆదోని పట్టణానికి చెందిన మాజీ సైనికుడు మహేష్ (60) గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడి బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని గౌలీపేట కాలనీకి చెందిన మాజీ సైనికుడు మహేష్ తన భార్య లక్ష్మితో కలిసి వారం రోజుల క్రితం ఆదోని నుంచి కేదార్‌నాథ్‌యాత్రకు వెళ్లారు. కేదార్‌నాథ్ సమీపంలో శుక్రవారం ఉదయం మహేష్‌కు అకస్మాత్తుగా తీవ్ర గుండెపోటు వచ్చింది. తోటి యాత్రికులు గమనించి చికిత్స అందించేలోపే ఆయన ప్రాణాలు విడిచారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అక్కడి అధికారులతో మాట్లాడి మృతదేహాన్ని ఆదోనికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.
ట్రాక్టర్ డ్రైవర్ దుర్మరణం
నందవరం: మండల కేంద్రం నందవరం సమీపంలో ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ తెలుగు వీరేష్(21) శుక్రవారం మృతి చెందాడు. గ్రామ సమీపంలోని పూలచింత చెరువు గట్టు నుంచి గరుసు (మట్టి) తరలించేందుకు స్థానిక ఎస్సీ కాలనీకి చెందిన తిప్పరాజు, ట్రాక్టర్ డ్రైవర్ తెలుగు వీరేష్ వెళ్లారు. శుక్రవారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో గరుసు మట్టిని లోడ్ చేసుకుని వస్తూ ఉండగా పూలచింత దిగువ కాలువ వద్ద రహదారిపై ఉన్న కల్వర్టుకు ట్రాక్టర్ ఢీకొన్ని బోల్తా పడింది. డ్రైవింగ్ సీట్‌లో ఉన్న వీరేష్ తీవ్రంగా గాయపడ్డాడు. మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో కోడుమూరు గ్రామ సమీపంలో మృత్యువాత పడ్డాడు. చేతికొచ్చిన కుమారుడు మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతుడి తల్లి సరస్వతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో
యువకుడి మృతి
గోస్పాడు: జూలేపల్లి గ్రామానికి చెందిన వడ్డే పెద్ద సుబ్బరాయుడు (19) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బైక్‌పై వడ్డే పెద్ద సుబ్బరాయుడు, నరసింహలు శుక్రవారం గోస్పాడు వైపు వెళ్తుండగా పసురుపాడు వద్ద ప్రమాదవశాత్తు బైక్ అదుపు తప్పి కింద పడింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వడ్డే పెద్ద సుబ్బరాయుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సుధాకర్ రెడ్డి తెలిపారు.
హోరాహోరీగా
కబడ్డీ పోటీలు
ఆదోని అర్బన్: మహాయోగి లక్ష్మమ్మవ్వ రథోత్సవం సందర్భంగా యువశక్తి టీం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సౌత్ ఇండియన్ కబడ్డీ పోటీలు శుక్రవారం హోరాహోరీగా జరిగాయి. కర్ణాటక, ఆంధ్ర, రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి 30 టీంలు పాల్గొన్నాయని ఆర్గనైజర్ రాజు తెలిపారు. స్థానిక ఆదోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో కబడ్డీ ఆడేందుకు ప్రత్యేకంగా మ్యాట్‌ను ఏర్పాటు చేసి మ్యాచ్‌లను నిర్వహించారు. శనివారం ఫైనల్ పోటీలు ఉంటాయని మొదటి విన్నర్‌కు రూ.40 వేలు, రన్నర్‌కు రూ.30 వేలు, మూడో బహుమతి రూ.20 వేలు, నాలుగో బహుమతి రూ.10 వేలు అందజేస్తున్నట్లు తెలిపారు.


