కర్నూలు(హాస్పిటల్): తమ వారు చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న వారిని సైతం అవినీతి జలగలు వదలడం లేదు. మృతదేహాన్ని ఇచ్చేందుకు సైతం డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ విషయాన్ని శుక్రవారం ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. నంద్యాల జిల్లా కోయిలకుంట్లకు చెందిన ఓ వ్యక్తి మరణించడంతో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని మార్చురీలో శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని అప్పగించేందుకు అక్కడి సిబ్బంది భారీగా డబ్బులు డిమాండ్ చేశారు. మృతుని కుటుంబసభ్యులు కొందరు బేరమాడి చివరకు రూ.2వేలు అక్కడి సిబ్బంది చేతిలో పెట్టారు. ఈ తతంగమంతా ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అవుతోంది. మార్చురీలో ప్రతిరోజూ 6 నుంచి 10 మృతదేహాల వరకు పోస్టుమార్టం నిర్వహిస్తుంటారు. అనంతరం వివిధ రకాల ఖర్చుల పేరుతో అక్కడి సిబ్బంది మృతుల కుటుంబీకులు, బంధువుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ విషయం తెలిసినా మెడికల్ కళాశాల, ఫోరెన్సిక్ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. మార్చురీలో పనిచేసే సిబ్బంది అందరూ అనధికారికంగా ఉన్న వారే కావడం గమనార్హం. ఇక్కడ రెండు పోస్టులున్నా ప్రభుత్వం భర్తీ చేయలేదు. కనీసం ఆసుపత్రిలో పారిశుధ్య సిబ్బంది కిందనైనా కొందరిని తీసుకుని ఇక్కడ నియమించాలని అధికారులు కోరినా పట్టించుకోని పరిస్థితి. దీంతో ఇక్కడి వైద్యులే బయటి వ్యక్తులను పిలిపించుకుని పనిచేయించుకుంటున్నారు. వీరు ప్రతిరోజూ మార్చురీని శుభ్రం చేయడం, మృతదేహాలను పోస్టుమార్టంకు రెడీ చేయడం, పోస్టుమార్టం అనంతరం కుట్లు వేసి, దానికి బట్టలు చుట్టి కుటుంబసభ్యులకు అందించే ప్రక్రియ నిర్వహిస్తుంటారు. ఈ విధులు నిర్వహించడానికి ప్రభుత్వం నుంచి అధికారికంగా సిబ్బంది ఎవరూ లేకపోవడం, అనధికారికంగా ప్రైవేటు వ్యక్తులు ఇక్కడ వచ్చి పనిచేయడంతో ఈ పరిస్థితి నెలకొందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


