శ్రీశైలంటెంపుల్: శ్రీశైల శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను శ్రీశైల జగద్గురు పీఠాధిపతి చెన్నసిద్దరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. గురువారం మల్లన్న దర్శనార్థం విచ్చేసిన పీఠాధిపతికి ఆలయ రాజగోపురం వద్ద దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు, ప్రధానార్చకులు శ్రీశైల జగద్గురు పీఠాధిపతికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం పీఠాధిపతి మల్లికార్జున స్వామికి రుద్రాభిషేకం, భ్రమరాంబాదేవికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం అమ్మవారి ఆలయం వద్ద ఉన్న ఆశీర్వచన మండపంలో పీఠాధిపతి గౌరవార్థం అర్చకులు, వేదపండితులు వేదగోష్టి నిర్వహించారు. అనంతరం పీఠాధిపతి గౌరవార్థం వస్త్రసమర్పణ చేశారు. చివరిగా పీఠాధిపతి భక్తులను అనుగ్రహణ భాషణం చేశారు.
8న జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు
కర్నూలు(అర్బన్): జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలను ఈ నెల 8న నిర్వహిస్తున్నట్లు సీఈఓ జీవీ రమణారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జెడ్పీ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి ఉత్తర్వుల మేరకు సమావేశాలను ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తున్నామన్నారు. సమావేశాల్లో గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, సాంఘిక సంక్షేమం, విద్య, వైద్యం, మహిళాభివృద్ధి–శిశు సంక్షేమం, పనులు, ఆర్థిక ప్రణాళిక అంశాలపై చర్చిస్తామన్నారు. సమావేశాలకు స్థాయి సంఘాల సభ్యులు, కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు వారికి కేటాయించిన సమాయానికి హాజరు కావాలని సీఈఓ కోరారు.
సూర్యనందీశ్వరునికి కిరణాభిషేకం
మహానంది: నందిపల్లె సమీపంలోని నవనంది పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన శ్రీసూర్యనందీశ్వరస్వామి దేవస్థానంలో గురువారం అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఉదయం సూర్యోదయం వేళ సూర్యనందీశ్వరస్వామిని సూర్యకిరణాలు తాకిన దృశ్యాన్ని చూసిన భక్తులు తన్మయత్వంతో పులకించి పోయారు. కాగా ప్రతి ఏటా వైశాఖమాసంలో ప్రతి నిత్యం ప్రత్యక్ష భగవానుడైన సూర్యదేవుని కిరణాలు నేరుగా సూర్యనందీశ్వరస్వామికి అభిషేకిస్తాయని అర్చకులు కృష్ణ శర్మ తెలిపారు.
ప్రైవేటులో ఉచిత ప్రవేశాల ఫలితాలు విడుదల
నంద్యాల(న్యూటౌన్): ఆర్‌టీఈ చట్టం 12సీ ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత ప్రవేశాల రెండో విడత ఫలితాలు విడుదలైనట్లు సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్ నిత్యానందరాజులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు కేటాయించిన 25 శాతం ఉచిత ప్రవేశాలకు సంబంఽధించి రెండో విడత ఫలితాలు వచ్చాయన్నారు. అందులో 346 మంది విద్యార్థులు ఎంపికయ్యారని చెప్పారు. వివరాలను https:// cse. ap. gov. in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామన్నారు. పాఠశాలలకు కేటాయించిన విద్యార్థుల తల్లిదండ్రులు కుల, ఆదాయ ధ్రువీకరణ స్టడీ సర్టిఫికెట్లతో ఈనెల 16వ తేదీలోపు సంబంధిత పాఠశాలలకు వెళ్లి తమ ప్రవేశాలను నిర్ధారించుకోవచ్చన్నారు. వివరాలకు టోల్‌ఫ్రీ నంబర్ 18004258599ను సంప్రదించాలన్నారు.
వ్యవసాయ పాలిటెక్నిక్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు
నంద్యాల(అర్బన్): ఆచార్య ఎన్‌జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నంద్యాల వ్యవసాయ పాలిటెక్నిక్ కోర్స్‌ల్లో చేరేందుకు విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ జారీ చేసిందని కళాశాల ప్రిన్సిపాల్ జాన్సన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కోర్సులో చేరేందుకు పదవ తరగతి పాస్ అయి న వారు అర్హులన్నారు. www. angrau. ac. in లో దరఖాస్తు చేసుకోవాలని, ఈనెల 21వ తేదీ వరకు గడువు ఉందన్నారు. మరిన్ని వివరాలకు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల కార్యాలయం పని వేళల్లో 9989625208ను సంప్రదించాలన్నారు.


