మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వ విఫలం
మొక్కజొన్న రైతుల పక్షాన పోరాడతాం
ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా, సీఈసీ మెంబర్ పీపీ నాగిరెడ్డి
నంద్యాల(అర్బన్): రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం రైతుల కష్టాలను గాలికొదిలేసిందని ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సీఈసీ మెంబర్ పీపీ నాగిరెడ్డి విమర్శించారు. ఆరుగాలం కష్టించి రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రభుత్వం మెడలు వంచి రైతులకు మద్దతు ధర వచ్చేంత వరకు పోరాటం సాగిస్తామంటూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో స్థానిక టెక్కె మార్కెట్‌యార్డు వద్ద నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మొక్కజొన్న రైతులతో వారు మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఇసాక్‌బాషా, పీపీ నాగిరెడ్డి మాట్లాడుతూ.. ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులకు అవసరమైన యూరియా, పురుగు మందులు అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. జొన్న, మొక్కజొన్న, వరి, పసుపు పంటలకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించినా రైతులకు మాత్రం దక్కడం లేదన్నారు. రైతులు దళారులను నమ్మి పూర్తిగా నష్టపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆర్‌బీకేల ద్వారా విత్తనాలు, ఎరువులు అందించి రైతులకు వెన్నుదన్నుగా నిలిచారన్నారు. కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని, వెంటనే ప్రభుత్వం స్పందించి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోతే వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రైతుల కోసం రాష్ట్ర వ్యాప్త పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. రైతు కంట కన్నీరు ఒలికితే ఏ ప్రభుత్వాలు మనుగడ సాగించలేవని, ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం కళ్లు తెరిచి మద్దతు ధర కల్పించి రైతులను ఆదుకోవాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి రత్నబాబు చౌదరి, నంద్యాల నియోజకవర్గ పరిశీలకులు సూర్యనారాయణరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ మాబున్నిసా, జిల్లా ఉపాధ్యక్షులు దాల్‌మిల్ అమీర్, రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి శశికళారెడ్డి, బసవేశ్వరరెడ్డి, రామసుబ్బారెడ్డి, శివనాగిరెడ్డి, దేవనగర్ బాషా, గోస్పాడు ఎంపీపీ ఆర్థర్‌సైమాన్, జిల్లా మేధావుల విభాగం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, వైఎస్సార్‌సీపీ జిల్లా పంచాయతీ రాజ్ విభాగం జిల్లా అధ్యక్షుడు కోటేశ్వరరెడ్డి జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, టీవీ రమణ, మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.


