కోవెలకుంట్ల: పట్టణంలోని రంగరాజుపేటలో వెలసిన శ్రీదేవి, భూదేవి సహిత పాండురంగ విఠలేశ్వరుడి బ్రహ్మోత్సవాలు గురువారం చక్రస్నానం, వసంతోత్సవంతో వైభవంగా ముగిశాయి. ఉత్సవాల్లో చివరి రోజు అర్చకులు స్వామివారికి పంచామృతాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ వసంతోత్సవాన్ని వేడుకగా జరుపుకున్నారు. లోక కల్యాణార్థం కోనేటిలో నిర్వహించిన చక్రస్నాన కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణం జనసంద్రమైంది. రాత్రి ధ్వజావరోహణ, కంకణ నిమజ్జనం, నాకబలి కార్యక్రమాలతో గత నెల 26న ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు ముగిశాయని ఆలయ అర్చకులు తెలిపారు.


